పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్ల ఆగడాలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయి. బరితెగించి ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమ గ్యాంగ్‌లో చేరాలనుకునే వారు ఫలానా వాట్సాప్ నెంబర్‌కు మెసేజ్ చేయాల్సిందిగా.. ఆ నెంబర్‌ను జత చేస్తూ ఫేస్‌బుక్‌లో ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రకటన వైరల్‌గా మారింది. దీనిని దేవేందర్ బాంబిహా పేరిట బాంబిహా గ్యాంగ్‌స్టర్ గ్రూపు క్రియేట్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
అసలేం జరిగింది : ఇటీవల పంజాబ్‌లో ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య అనంతరం పలువురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పంజాబ్‌లో ప్రధాన గ్యాంగ్‌స్టర్ గ్రూపులైన లారెన్స్ బిష్ణోయ్, బాంబిహాలకు చెందిన వారు పరస్పరం సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకున్నారు.ఈ క్రమంలో లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్‌నకు చెందినట్లుగా భావిస్తున్న సందీప్ బిష్ణోయ్‌ను రాజస్థాన్‌లోని నాగౌర్ కోర్టుకు తరలిస్తుండగా బైక్‌పై వచ్చి కొందరు హత్య చేశారు. దీనికి తామే కారణమని బాంబిహా గ్రూప్ ప్రకటించుకుంది. దీంతో ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ సరైన సమయం కోసం వేచిచూస్తున్నట్లు బాంబిహా గ్రూప్‌నకు పక్కా సమాచారం ఉంది. ఈ క్రమంలో బాంబిహా గ్రూప్ ఫేస్‌బుక్‌లో ప్రకటన చేయడం గమనార్హం.
ఎవరీ దేవేందర్ బాంబిహా ??
బఠిండా పోలీసుల చేతిలో రాంపురా ఫూల్లో ఎన్కౌంటర్ అయిన గ్యాంగ్‌స్టర్ దేవేందర్ బాంబిహా.. షార్ప్ షూటర్‌గా ప్రసిద్ధి. దేవేందర్‌తో పాటు అతని సహచరుడు సర్వజిత్ సింగ్‌పై అనేక హత్య కేసులు నమోదయ్యాయి. 2013 సెప్టంబర్లో ఫరీద్కోఠ్ డబుల్ మర్డర్ కేసులో పట్టుబడ్డ వీరిని కోర్టులో హాజరు పరుస్తున్న సమయంలో తప్పించుకున్నారు.
అనంతరం, ఫరీద్కోఠ్ పోలీసులు 2014లో బాంబిహాను లుధియానాలో పట్టుకున్నారు. పోలీసులకు, బాంబిహాకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో బాంబిహా గాయపడ్డాడు. కానీ, పోలీసులు బాంబిహాను ఎక్కువ కాలం జైలులో ఉంచలేకపోయారు. 2015 జనవరిలో బాంబిహా తన నలుగురు సహచరులతో కలిసి లూధియానా సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత పోలీసులకు చిక్కలేదు. బంబిహాకు గుజరాత్, మహారాష్ట్రలోని అనేక క్రిమినల్ గ్యాంగ్‌లతో సంబంధాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు ఆర్మేనియా నుంచి బంబిహా గ్యాంగ్ కార్యకలాపాలు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి : శిందే వర్గానికి షాక్.. ఠాక్రే శివసేన ఆధ్వర్యంలోనే దసరా ర్యాలీ
'అర్బన్ నక్సల్స్'పై మోదీ ఫైర్.. కోర్టులనూ ప్రభావితం చేస్తున్నారంటూ..