Muslim Girl Medals In Sanskrit: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ముస్లిం విద్యార్థిని గజాలా ఎంఏ సంస్కృతం విభాగంలో విశ్వవిద్యాలయంలోనే ఉత్తమ విద్యార్థినిగా నిలిచింది. సంస్కృతంలో ఏకంగా ఐదు పతకాలు సాధించింది. లఖ్‌నవూ యూనివర్సిటీ(ఎల్యూ) డీన్ ప్రొ. శశి శుక్లా.. గజాలాకు మెడల్స్ అందజేశారు. గజాలాకు కేవలం సంస్కృతంలోనే కాదు.. ఆంగ్లం, హిందీ, ఉర్దూ, అరబిక్ భాషల్లోనూ మంచి పట్టుంది.
వారివల్లే ఈ పతకాలు
చిన్నవయసులోనే తండ్రి చనిపోవడం వల్ల గజాలాకు అన్నీ తామై పెంచారు సోదరులు షాదాబ్, నయాబ్.
"ఈ పతకాలు నేను గెలుచుకోలేదు. నా సోదరులు సాధించారు. షాదాబ్, నయాబ్ చిన్న వయసులోనే పాఠశాలకు వెళ్లడం మానేసి గ్యారేజీలో పనిచేస్తూ నన్ను చదివించారు." అని గజాలా భావోద్వేగానికి గురైంది. గజాలా సోదరి ఓ దుకాణంలో పనిచేస్తుండగా.. తల్లి నజ్రీన్బానో ఇల్లు చూసుకుంటోంది.
రోజుకు 7గంటలు సంస్కృతం పఠనం..
గజాలా తన కుటుంబంతో కలిసి లఖ్‌నవూలో ఉంటోంది. రోజుకు ఏడు గంటలపాటు సంస్కృతం పఠిస్తోంది. సంస్కృతంలో ప్రొఫెసర్ కావాలన్నదే తన కల అంటోంది గజాలా. క్యాంపస్‌లో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినా గజాలా పాల్గొంటుంది. సంస్కృతంలో శ్లోకాలు, గాయత్రి మంత్రం, సరస్వతి వందనం లాంటి భక్తి శ్లోకాలు స్టేజీపై పఠిస్తుంది.
అన్ని భాషలకు అమ్మ సంస్కృతం..
"దేవుడి సొంత భాష సంస్కృతం. ఇది అన్ని భాషలకు అమ్మ వంటిది. సంస్కృతంలో పద్యాలు, కవిత్వం వినసొంపుగా ఉంటాయి. 5వ తరగతిలోనే పాఠశాలలో సంస్కృతం నేర్చుకున్నా. ముస్లిం అయి ఉండి సంస్కృతంలో పట్టుసాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది. " అని గజాలా తెలిపింది.
ప్రస్తుతం తనకు వైదిక సాహిత్యంలో పీహెచ్డీ చేయాలని ఉందని వెల్లడించింది గజాలా.
ఇదీ చూడండి: క్రికెట్ బాల్ కోసం భారీ ఫైట్.. రోడ్డుపై కర్రలు, రాళ్లతో కొట్టుకుంటూ...