Kid Bite Snake : ఆడుకుంటూ పామును కొరికి చంపిన ఓ బాలుడు.. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. సమయానికి మెరుగైన వైద్యం అందడం వల్ల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్, ఫరూఖాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఇదీ జరిగింది..
కొత్వాలి మహ్మదాబాద్ ప్రాంతం మద్నాపుర్ గ్రామంలో దినేశ్ సింగ్ అనే వ్యక్తి తన మూడేళ్ల కుమారుడు, తల్లితో కలిసి ఉంటున్నాడు. శనివారం ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడికి.. అదే సమయంలో అక్కడకు వచ్చిన పాము కంట పడింది. పామును చూసిన బాలుడు ఎటువంటి భయం లేకుండా దాని దగ్గరకు వెళ్లాడు. అది విషపూరితమైన ప్రాణి అని తెలియక చేతులతో పట్టుకున్నాడు. సర్పాన్ని నోటితో కొరికి చంపాడు. ఆ తర్వాత బాలుడి ఆరోగ్యం విషమించి స్పృహతప్పి పడిపోయాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చనిపోయిన పాముతో పాటు అతడ్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు వెంటనే స్పందించి బాలుడికి చికిత్స అందించారు. అతడు క్షేమంగానే ఉన్నాడని చెప్పాక కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకు ముందు అతడు ఇలాంటి పని చేయలేదని నానమ్మ సునీతా దేవి చెప్పింది.
కాటేసిన పాముపై రివేంజ్ తీసుకున్న బాలుడు.. గతేడాది ఛత్తీస్‌గఢ్‌లో ఘటన..
పాము మనిషిని కాటు వేయడం సహజమే. అలాంటి వార్తలు కూడా తరచూ వింటూనే ఉంటాం. అలాగే గతేడాది ఛత్తీస్‌గఢ్‌లో ఓ పిల్లాడికి పాము కాటేసింది. ఇందులో ఏముంది అనుకుంటున్నారా? తనను కాటు వేసిందన్న కోపంతో ఆ పిల్లాడు తిరిగి పామును కరిచాడు. ఈ ఘటనలో బాలుడి దెబ్బకు పాము చనిపోగా.. ఆ అబ్బాయి మాత్రం ఆరోగ్యంగా ఉన్నాడు.
అసలు ఏం జరిగిందంటే.. జష్‌పుర్ జిల్లా గార్డెన్ డెవలప్‌మెంట్ బ్లాక్‌కు చెందిన పండారపథ్‌లోని కోర్వా తెగకు చెందిన దీపక్ రామ్ అనే 12 ఏళ్ల బాలుడిని పాము కాటేసింది. ఆ చిన్నారి ఆడుకుంటూ తన సోదరి ఇంటికి వెళ్తుండగా.. దీపక్ చేతికి ఏదో తాకినట్టు అనిపించింది. తీరా చూస్తే పాము కాటేసింది. దీంతో ఆగ్రహించిన దీపక్.. పామును పట్టుకుని రెండు చోట్ల కరిచాడు. ఈ ఘటనలో పాము అక్కడికక్కడే చనిపోయింది. ఈ విషయం వెంటనే చిన్నారి తన కుటుంబ సభ్యులతో చెప్పగా.. దీపక్‌ను ఆస్పత్రికు తరలించారు. ఈ ఘటనలో చిన్నారి ఆరోగ్యంగా బయటపడ్డాడు. అయితే జష్పుర్లో మనుషుల్ని పాము కరిస్తే వారు కూడా తిరిగి పామును కరవాలని.. అలా చేస్తే ఏ ప్రమాదం ఉండదని వారి నమ్మకం.