Fake ACB Police : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కొట్టలపల్లికి చెందిన నూతేటి జయకృష్ణ.. అలియాస్ 'జయ' బీకాం పూర్తి చేశాడు. 2017లో అనంతపురంలో సేల్స్‌మెన్‌గా పని చేస్తూ సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి సన్నద్ధమయ్యాడు. జల్సాలకు అలవాటుపడ్డ అతను 2017లో అనంతపురంలో తొలిసారి గొలుసు దొంగతనం చేసి ఐదు రోజులు జైలుకెళ్లాడు. అక్కడ అనిల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. బెయిల్‌పై బయటికొచ్చాక హైదరాబాద్‌కు వచ్చి మరోసారి ఎస్సైకి సన్నద్ధమయ్యాడు.
సినిమా చూసి ప్రభావితమై: ఈ క్రమంలోనే సూర్య నటించిన గ్యాంగ్ సినిమాతో ప్రభావితమై శ్రీనాథ్ అనే మరో వ్యక్తితో కలిసి అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు నకిలీ ఏసీబీ అధికారుల అవతారమెత్తారు. అలా ఆ అవతారంలో ఓ అధికారికి ఫోన్ చేసి డబ్బులు వసూలు చేసి జైలుకెళ్లారు. బెయిల్ మీద బయటకొచ్చిన జయకృష్ణ మళ్లీ అదే మార్గంలో నడిచాడు. కాలేజీ స్నేహితులు రాఘవేంద్ర, రామచంద్రతో కలిసి పట్టణంలో 16 గొలుసులు దొంగిలించారు. ఆ తర్వాత జైల్లో పరిచయమైన సాల్మన్ రాజ్, సాయికుమార్, గంగయ్యతో కలిసి 2019 నుంచి 2022 మధ్య కర్నూలు, పులివెందుల, అనంతపురం, మచిలీపట్నం, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మున్సిపల్, రవాణా, పౌర సరఫరా శాఖల అధికారులకు ఏసీబీ అధికారినంటూ డబ్బు వసూలు చేశారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌లోనే నిందితునిపై 32 కేసులు నమోదయ్యాయి. ఏపీలో తెరదించిన అతడి కన్ను తెలంగాణపై పడింది. ఇక్కడా మోసాలు చేసేందుకు బెంగళూరుకు మకాం మార్చాడు.
AP fake ACB Police : బెంగళూరులో కొందరితో పరిచయం పెంచుకున్న జయకృష్ణ వారి బ్యాంకు ఖాతాలు సేకరించారు. దాదాపు 150 ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డులు దొడ్డిదారిలో సంపాదించాడు. గతేడాది ఆగస్టు నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాల అధికారుల ఫోన్ నెంబర్లను ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి సేకరించే వాడు. తనకు డబ్బు అవసరమైన ప్రతీసారి అధికారుల్ని ఎంచుకుని ఫోన్ చేసేవాడు. హైదరాబాద్ సహా 15 జిల్లాలకు చెందిన నీటి పారుదల, విద్యుత్తు, విద్య, సాంఘిక సంక్షేమం, రెవెన్యూ, పంచాయతీరాజ్, మార్క్‌ఫెడ్, పౌర సరఫరాల శాఖలకు చెందిన దాదాపు 200 మంది అధికారుల నుంచి గతేడాది ఆగస్టు నుంచి రూ.70 లక్షల వరకు వసూలు చేశాడు.
Shamshabad policed arrested Fake ACB Police : ఈ ఏడాది జూన్‌లో సిద్దిపేట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారికి ఫోన్ చేసి రూ.3 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడు. శంషాబాద్‌లోనూ ఓ అధికారిని బెదిరించాడు. ఈ వ్యవహారంపై దృష్టిపెట్టిన శంషాబాద్ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్ టీం.. ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితుడు బెంగళూరులో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. నిందితుడు తన పని కోసం ఇటీవల హైదరాబాద్‌కు వచ్చాడు. ఇదే అదనుగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుడి దందాపై పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నిందితుడు బెంగళూరులో ఉండే సమయంలో తన ఆచూకీ పోలీసులకు అంతుబట్టకుండా కొత్త పథకం వేశాడు. అధికారులకు ఫోన్ చేసి బెదిరించాలనుకుంటే ఉదయం 11 గంటలకు స్థానికంగా ఏసీ బస్సు ఎక్కేవాడు. అందులో ప్రయాణిస్తూ అందరికీ ఫోన్ చేసి డబ్బులు అడిగేవాడు. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసేవాడు. పోలీసులకు సెల్ టవర్ ఆచూకీ చిక్కకుండా ఇలా చేసేవాడు. ఏసీబీ అధికారినంటూ మాట్లాడే సమయంలో మిమిక్రీ చేసి ఇన్‌స్పెక్టర్, డీఎస్పీనంటూ రెండు గొంతులతో మాట్లాడటం నిందితుని ప్రత్యేకత. మొదట ‘హైదరాబాద్ నుంచి ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ను మాట్లాడుతున్నానంటూ భయపెడతాడు.
‘మీపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.. సెటిల్ చేసుకుంటే ఓకే. లేకపోతే రైడ్ జరుగుతుందని వంచిస్తాడు. కావాలంటే తమ డీఎస్పీతో మాట్లాడాలంటూ బెదిరిస్తాడు. హడలిపోయే ఉద్యోగుల నుంచి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బు వసూలు చేస్తాడు. కాల్ మాట్లాడే సమయంలోనే డబ్బు వసూలు చేస్తాడు. ఇలా వసూలు చేసిన డబ్బుతో గోవాలో జల్సా చేస్తాడు. రోజుకు రూ.లక్షకు పైగా ఖర్చు చేసి క్యాసినోలు ఆడతాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు జయకృష్ణ ఏపీలోని ప్రకాశం జిల్లా రెండో పట్టణం, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మూడో పట్టణ, ఏలూరు గ్రామీణ, అనంతపురం జిల్లా, కృష్ణ జిల్లా పోలీసులు ‘మోస్ట్ వాంటెడ్’ నేరగాళ్ల జాబితాలో చేర్చారు. నిందితుడి నుంచి 85 వేల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.2.24 లక్షలు, 5 సిమ్‌కార్డులు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు..
"చాలామంది ప్రభుత్వ అధికారులు కేసు నమోదు చేయలేదు. ముందుకు రావడానికి భయపడుతున్నారు. నిందితుడి దగ్గర నుంచి రూ.2.24 లక్షల నగదు, 5 సిమ్‌కార్డులు, 8సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం." - నారాయణ రెడ్డి, శంషాబాద్ డీసీపీ
ఇవీ చదవండి: