కలెక్టర్ కార్యాలయం.. మధ్యాహ్న సమయం.. సరిగ్గా అప్పుడే ఓ వృద్ధుడు అక్కడికి చేరుకున్నాడు. నేరుగా కలెక్టర్ ఉండే గదిలోకి వెళ్లాడు. అందరిలాగే తనకున్న సమస్యలేవో పరిష్కరించాలని కోరేందుకు వచ్చాడేమో అనుకున్నారు అక్కడి సిబ్బంది. కానీ, ఆయన తన రూ.2 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాలను బయటకు తీసి, 'ఈ ఆస్తి మీదే' అంటూ కలెక్టర్‌కు అందించడం చూసి.. ఆశ్చర్యపోవడం అక్కడున్న వాళ్ల వంతైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది.
అసలేం జరిగింది?
ఆగ్రాలోని(Up agra news) నీరాలబాద్ పీపల్ మండి ప్రాంతానికి చెందిన 88 ఏళ్ల గణేశ్ శంకర్ పాండే... తన ఆస్తిని కలెక్టర్ పేరు మీద రాశారు. తన సోదరులు నరేశ్ శంకర్ పాండే, రఘునాథ్ శంర్ పాండే, అజయ్ శంకర్ పాండేతో కలిసి గణేశ్ శంకర్ పాండే.. 1983 మార్చి 30న 1000 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత తన సోదరులు విడిపోయారు. ఆ భూమిలో తన వాటాగా దక్కిన భూమిని 2018 ఆగస్టు 4న ఆగ్రా కలెక్టర్ పేరు మీద వీలునామా(Old man will to dm) రాశారు గణేశ్ శంకర్ పాండే. ఇందుకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను గణేశ్ శంకర్.. కలెక్టర్‌కు అప్పగించేందుకు గురువారం వచ్చారు. ఈ భూమి విలువ రూ.2 కోట్లు ఉంటుందని అంచనా.
ఇంటి నుంచి తరిమేయగా..
తన కుటుంబ సభ్యులు ఇంటి నుంచి తరిమేశారని గణేశ్ శంకర్ తెలిపారు. ప్రస్తుతం తన సోదరులు రఘునాథ్, అజయ్‌ల వద్ద తాను ఉంటున్నానని చెప్పారు. తన ఇద్దరు కుమారులు తనను పట్టించుకోకుండా వదిలేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన ఆస్తిని.. కలెక్టర్ పేరు మీద రాయాలని నిర్ణయం తీసుకున్నాని చెప్పారు. తన కుటుంబం గురించి చెబుతూ గణేశ్.. కన్నీటి పర్యంతం అయ్యారు.
ఇదీ చూడండి: వృద్ధురాలి ఔదార్యం.. రిక్షా కార్మికుడికి రూ.కోటి ఆస్తి దానం