Delhi High Court: భార్య, భర్తలు విడాకులు కోరడానికి పెళ్లి జరిగి కనీసం ఏడాదైనా పూర్తి కావాలని తెలిపింది దిల్లీ హైకోర్టు. కుటుంబ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన జంటకు విడాకులు మంజూరు చేసేందుకు నిరాకరించింది. దాంపత్య సంబంధాన్ని తిరస్కరించడం విడాకులకు కారణంగా చెప్పొచ్చని, క్రూరత్వంగా పరిగణించవచ్చని, కానీ దాన్ని అసాధారణ కష్టంగా పరిగణించలేమని వ్యాఖ్యానించింది. హిందూ వివాహ చట్టం ప్రకారం దంపతులకు విడాకులు కావాలంటే కనీసం ఏడాదైనా పూర్తి కావాలని స్పష్టం చేసింది. ఈ జంట ముందుగా కుటుంబ కోర్టును ఆశ్రయించగా.. అక్కడ విడాకులు మంజూరు కాలేదు. ఇప్పుడు హైకోర్టు కూడా పిటిషన్‌ను తిరస్కరించింది. ఇద్దరి మధ్య దాంపత్య సంబంధం లేదని, అందుకే విడాకులు ఇవ్వాలని భార్య, భర్తలు కోర్టును ఆశ్రయించారు.
విచారణ సమయంలో గతంలో ఏడాదిలోపే విడాకులు మంజూరు చేసిన కేరళ, పంజాబ్ హరియాణా హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. విడాకులకు కావాల్సిన సంవత్సర గడువు ముగిసిన తర్వాత ఇరువర్గాలు కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ జంట ఏప్రిల్ 4, 2021న హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే వీరి మధ్య వైవాహిక విభేదాలు తలెత్తాయి. అనంతరం ఏప్రిల్ 14, 2021 నుంచి ఇద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు. గతేడాది జులై 29నే భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది.
ఇదీ చదవండి: లఖింపుర్ హింస కేసులో ఆశిష్ మిశ్ర బెయిల్ రద్దు