ప్రియుడితో కలిసి తండ్రిని హత్య చేయించిన యువతి స్నేహ కాంబళెను కర్ణాటక రాష్ట్రం బెళగావి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. హత్యను ప్రోత్సహించిన ఆమె తల్లి అయిన రోహిణి కాంబళె, ఆమె ప్రియుడు అక్షయ విఠకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హత్య తామే చేశామని ఒప్పుకున్నారు. పోలీసులకు అనుమానం కలగకుండా ఉండాలని 'దృశ్యం' సినిమాను వారు ముగ్గురు పదిసార్లు చూసినట్లు విచారణలో తెలిపారు.
![Daughter killed her father with the help of her mother and lover](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-bgm-03-29-murder-aropi-arrest-ka10029_29092022133056_2909f_1664438456_105_2909newsroom_1664463055_616.jpg)
![Daughter killed her father with the help of her mother and lover](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-bgm-03-29-murder-aropi-arrest-ka10029_29092022133057_2909f_1664438457_385_2909newsroom_1664463055_654.jpg)
![Daughter killed her father with the help of her mother and lover](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-bgm-03-29-murder-aropi-arrest-ka10029_29092022133057_2909f_1664438457_969_2909newsroom_1664463055_258.jpg)
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెళగావికి చెందిన భూవ్యాపారి సుధీర్ కాంబళె గతంలో దుబాయ్‌లో పని చేసేవాడు. కరోనా సమయంలో బెళగావిలోని క్యాంప్ ఏరియాలో ఉంటూ భూవ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాడు. సుధీర్, రోహిణిల కుమార్తె స్నేహ. మహారాష్ట్రలోని పుణెలో ఒక కళాశాలలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్నప్పుడు ఆమెకు అక్షయ్ విఠకర్ పరిచయమయ్యాడు. వారి ప్రేమ విషయాన్ని సుధీర్ ఇటీవల గుర్తించి కుమార్తెను మందలించాడప. దీంతో తండ్రి అడ్డు తప్పించాలని ఆమె భావించి విషయాన్ని తల్లికి చెప్పగా.. హత్యను ఆమె ప్రోత్సహించింది.
తన ప్రియుడ్ని పుణె నుంచి బెళగావికి సెప్టెంబరు 15న పిలిపించిన స్నేహ.. పథకం ప్రకారం ఓ లాడ్జిలో ఉంచింది. తండ్రి ఇంటి పై అంతస్తులో నిద్రిస్తున్నప్పుడు 17న ఉదయం అక్షయ్‌ను తల్లీబిడ్డలు ఇంటికి పిలిపించారు. సుధీర్ కాళ్లు చేతులను వారిద్దరూ పట్టుకోగా.. ఆయన కడుపు, గొంతు, చేతులు, మొహంపై ఓ కత్తితో అక్షయ్ ఇష్టానుసారం పొడిచాడు. సుధీర్ మరణించారని ధ్రువీకరించుకున్నాక అక్షయ్ పుణెకు వెళ్లిపోయాడు. తన భర్తను ఎవరో హత్య చేసి పరారయ్యారని రోహిణి ఇచ్చిన ఫిర్యాదుతో డీసీపీ రవీంద్ర దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఎలా అడిగినా.. వారిద్దరూ ఒకే రకమైన సమాధానాలిచ్చారు. అనుమానంపై తల్లీకుమార్తెల ఫోన్‌కాల్స్‌ను పోలీసులు పరిశీలించారు. స్నేహ క్రమం తప్పకుండా అక్షయ్‌తో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. ఆపై విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదీ చదవండి: ఆ 67 అశ్లీల వెబ్‌సైట్‌లపై కేంద్రం కొరడా.. వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశాలు