బౌద్ధమతాన్ని ధ్వంసం చేయాలన్న చైనా ప్రయత్నాలు ఫలించవని దలైలామా పేర్కొన్నారు. ఆయన బుద్ధగయలో ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాలో బౌద్ధమతాన్ని నమ్మే వాళ్లు ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ యత్నాలు ఏమాత్రం పని చేయవన్నారు. "హిమాలయాల్లోని స్థానిక ప్రజలు బుద్ధుడిని ఆరాధిస్తారని నేను సందర్శనల్లో గుర్తించాను. ఇదే పరిస్థితి మంగోలియా, చైనాల్లో కూడా కనిపిస్తుంది. కానీ, చైనాలో ప్రభుత్వం మతాన్ని విషంలా చూస్తోంది. కానీ, వారు దీనిని నాశనం చేయడానికి చూస్తున్నారు. కొంత దెబ్బతీయవచ్చేమో కానీ, పూర్తిగా నిర్మూలించడం వారి వల్లకాదు. ఇప్పటికీ చైనాలో చాలా మంది బౌద్ధమతాన్ని నమ్ముతారు" అని దలైలామా అన్నారు.
టిబెట్‌లోని బౌద్ధమతం పశ్చిమ దేశాల్లో చాలా మందిని ఆకర్షించిందని దలైలామా వెల్లడించారు. ఒకప్పుడు ఇది కేవలం ఆసియాకు చెందిన మతంగానే చూసేవారని.. ఇప్పుడు మాత్రం ఈ మతానికి చెందిన చాలా అంశాలు ప్రపంచ వ్యాప్తం అయ్యాయన్నారు. చాలా మంది శాస్త్రవేత్తలు ఈ మతంపై ఆసక్తి పెంచుకొన్నారని వివరించారు. బౌద్ధమత దేశమైన చైనాలో మాత్రం అణచివేతకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత దలైలామా బుద్ధగయను సందర్శించారు. ఆయన పర్యటన సందర్భంగా ఒక చైనా మహిళ అనుమానాస్పద కదలికలు కలకలం రేపాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆమె పేరు సాంగ్ షియావోలాన్ అని పేర్కొన్న పోలీసులు.. ఆమె స్కెచ్ ఫొటోతో పాటు పాస్‌పోర్టు, వీసా వివరాలను విడుదల చేశారు.