Congress president election: ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న ఎంపీ శశిథరూర్.. తనకు దేశవ్యాప్తంగా కార్యకర్తల మద్దతు ఉందని ప్రకటించుకున్నారు. తనకు ఏ స్థాయిలో మద్దతు ఉందో నామినేషన్ రోజు తెలుస్తుందని చెప్పారు. పోటీకి తాను ఆసక్తితో ఉన్నానని చెప్పిన ఆయన.. సెప్టెంబర్ 30(నామినేషన్లకు చివరిరోజు) తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత వస్తుందని అన్నారు. పోటీ గురించి గాంధీ కుటుంబంతో మాట్లాడినట్లు తెలిపారు.
"నేను నామినేషన్ వేసేటప్పుడు నాకు ఎంత మద్దతు ఉందో మీరే చూస్తారు. వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ వర్కర్లు నాకు మద్దతు ఇస్తే పోటీ చేస్తా. చాలా మంది కార్యకర్తలు పోటీ చేయమని అడుగుతున్నారు. నామినేషన్ పత్రాలు నాకు అందాయి. పార్టీ నేతలను కలుస్తున్నా. పోటీ విషయంపై సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలతో మాట్లాడా. తమకేం అభ్యంతరం లేదని ముగ్గురూ స్పష్టంగా చెప్పారు. కేరళ కార్యకర్తలు సైతం నాకు అండగా ఉన్నారు."
-శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ
కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలుస్తారంటూ ఊహాగానాలు వెలువడిన సమయంలో.. సోనియా గాంధీని కలిశారు థరూర్. ఎన్నికల్లో పోటీ చేస్తానని సోనియాకు థరూర్ వివరించినట్లు సమాచారం. అందుకు సోనియా అభ్యంతరం వ్యక్తం చేయలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో తాను తటస్థంగా ఉంటానని చెప్పినట్లు వెల్లడించాయి. అధికారిక అభ్యర్థి అంటూ ఎవరూ ఉండరని స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇచ్చారు. అక్టోబర్ 1న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 8 వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉంటుంది. అక్టోబర్ 17న ఓటింగ్ నిర్వహిస్తారు. రెండు రోజుల తర్వాత(అక్టోబర్ 19న) ఫలితాలు ప్రకటిస్తారు.