Chandrababu Case in ACB Court : చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్ల విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. సీఐడీ కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ కోర్టు చంద్రబాబు తరఫు న్యాయవాదులను ఆదేశించింది. అదే విధంగా బెయిల్ పిటిషన్‌పై సీఐడీ అధికారులు దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ పరిశీలించిన న్యాయమూర్తి.. పలు సవరణలు సూచిస్తూ తిరిగి అందించాల్సిందిగా ఆదేశించారు. రెండు పిటిషన్లపై రేపు విచారణ జరిపి ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును మరో ఐదు రోజుల కస్టడీ (Custody)కి కోరుతూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. మరోవైపు బెయిల్ పిటిషన్ విచారించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. ఈ నేపథ్యంలో కస్టడీ, బెయిల్ పిటిషన్లలో.. దేనిపై తొలుత విచారణ జరగాలనే అంశంపై వాదనలు జరిగాయి. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై సీఐడీ దాఖలు చేసిన కౌంటర్‌లో సవరణలు చేసి మళ్లీ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.
అంతకుముందు ఈ నెల 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు చంద్రబాబును కస్టడీలో విచారించిన సీఐడీ బృందం.. కోర్టు ఆదేశాల మేరకు నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించింది. తిరిగి ఐదు రోజులు కస్టడీకి కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. కౌంటర్‌లో సవరణలు చేసి మళ్లీ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరో వైపు సీఐడీ కస్టడీకి ఇవ్వడంపై హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది.
సుప్రీం కోర్టులో.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా (Siddhartha Luthra) సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. ఏపీలో ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారన్న సిద్దార్ధ లూథ్రా తెలపగా.. ఎన్ని రోజులుగా చంద్రబాబు కస్టడీలో ఉన్నారని సీజేఐ అడిగారు. ఈ నెల 8న చంద్రబాబును అరెస్టు చేశారని సిద్దార్ధ లూథ్రా సమాధానమివ్వగా.. రేపు మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని సీజేఐ సూచించారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసు (skill development case) లో సీఐడీ కస్టడీ ముగియటంతో టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడీషయల్ రిమాండ్ ను అక్టోబర్ 5 వరకు పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబుతో మాట్లాడిన న్యాయమూర్తి.. మీపై ప్రస్తుతం వచ్చినవి అభియోగాలు మాత్రమే, దర్యాప్తు చేశాక నిజమా? కాదా? అనేది తర్వాత తేలుతుందన్నారు. మిమ్మల్ని రెండు రోజులు సీఐడీ కస్టడీకి ఇచ్చాము.. మొదటి రోజు ఉదయం 11.30 గంటల వరకు విచారణ ప్రారంభం కాలేదని తెలిసింది నిజమేనా అని అడిగారు. మీరు న్యాయవాదికి కనిపించేంత దగ్గర్లో ఉండేందుకు అనుమతిచ్చాం.. ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలన్నా.. ఈ సౌకర్యాలన్ని కల్పించారా అని అడిగి తెలుసుకున్నారు. థర్డ్‌డిగ్రీ ప్రయోగించి ఫిజికల్‌గా ఏమైనా ఇబ్బంది పెట్టారా? అని ప్రశ్నించగా.. అదేమీ లేదని చంద్రబాబు తెలిపారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరించానని, ఏ తప్పు చేయలేదని చెప్తూ.. ఈ కేసుతో తనకు సంబంధం లేకున్నా కావాలనే ఇరికించారని వివరించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు క్యాబినెట్ నిర్ణయం (Cabinet decision) అని చెప్తూ.. తననెలా బాధ్యుడిని చేస్తారని అన్నారు.