Praveen nettaru death: కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో భాజపా యువనేత హత్య హింసకు దారితీసింది. జిల్లా భాజపా యువ మోర్చా నేత ప్రవీణ్ నెట్టారును మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో చేసిన దాడిలో చనిపోయాడు. దీంతో భాజపా నేతలు, యువమోర్చా నాయకులు భారీగా ఆస్పత్రి వద్దకు చేరుకుని నిరసన చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. రెచ్చిపోయిన నిరసనకారులు.. వాహనాలపై రాళ్లు రువ్వారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అదే సమయంలో ఆస్పత్రి వద్దకు వచ్చిన భాజపా కర్ణాటక అధ్యక్షుడు, దక్షిణ కన్నడ ఎంపీ నలిన్‌కుమార్ కటీల్ కారును అడ్డుకున్న ఆందోళనకారులు.. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి సునీల్ కుమార్, ఎమ్మెల్యేలకు నిరసనకారుల సెగ తగిలింది. వారి కార్లపై దాడి చేసిన కార్యకర్తలు.. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు.. ఆందోళనకారులను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రవీణ్ అంత్యక్రియలను బళ్లారిలో కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో నిర్వహించారు.
"నేను, ఆయన తల్లిదండ్రులు వద్దు అని చెప్పినప్పటికీ.. ప్రజలు, సమాజం కోసం పగలు, రాత్రి పని చేశాడు. నేను ఆయన్ని కోల్పోయాను. ఎవరు ఆయన్ని వెనక్కి తీసుకువస్తారు. ఆయన సమాజం కోసం ఎంతో చేశారు. కానీ ఆ సమాజం ఆయనను కాపాడలేకపోయింది. సమాజం కోసం పనిచేసే ఏ ఒక్కరికి నాలా జరగకూడదు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి."
-నూతన, ప్రవీణ్ భార్య
భాజపా కార్యకర్త హత్యను ఖండించారు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై. తమ పార్టీ కార్యకర్తను దారుణంగా చంపిన నిందితుల్ని త్వరలోనే పట్టుకొని శిక్షిస్తామని చేప్పారు. ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన కుటుంబసభ్యులు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని అన్నారు. అవసరమైతే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడానికి సైతం వెనకాడబోమని స్పష్టం చేశారు. మరోవైపు ఈ హత్యను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. హత్యలు జరిగాక చర్యలు తీసుకునే బదులు ముందుగానే నివారించాలని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి తెలిపారు.
భాజపా యువ మోర్చా నాయకుడు ప్రవీణ్(32) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని నెట్టారు ప్రాంతంలో మంగళవారం జరిగింది. దుండగులు మూకుమ్మడిగా దాడి చేయగా.. ప్రవీణ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. పౌల్ట్రీ షాప్ యజమాని అయిన ప్రవీణ్‌పై మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో దాడి జరిగింది. ఇద్దరు దుండగులు.. పదునైన ఆయుధాలతో భాజపా కార్యకర్తపై విరుచుకుపడ్డారు. హత్యకు గల కారణాలేంటి? హత్య చేసింది ఎవరు? అనేది తెలియరాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న బెళ్లారె పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.
ప్రవీణ్ హత్యపై దక్షిణ కన్నడ జిల్లాలో భాజపా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దక్షిణ కన్నడ జిల్లాలోని సుళ్య, కడబ, పుత్తూర్ తాలూకాల్లో.. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు.. హిందూ సంస్థలు స్థానికంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే.. ప్రభుత్వ బస్సులపై కొందరు రాళ్లు విసిరారు.
ఇవీ చదవండి: ఇంటి కింద పది కోట్లు.. ఒకే చెట్టుకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉరి!
'ఆమె' సంకల్పానికి సలాం.. అవమానాలు భరించి.. వైకల్యాన్ని ఓడించి..