ప్రజల సహకారంతో కరోనాపై పోరులో విజయం సాధిస్తామని కేంద్రం విశ్వాసం వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ ద్వారా మంచి ఫలితాలు వస్తాయని విశ్వసిస్తున్నట్లు సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ చెప్పారు. దిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.
కరోనాపై పోరుకు అవలంబించాల్సిన అంశాలపై కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చించామన్న జావడేకర్.. పాలు, నిత్యావసర సరుకుల దుకాణాలు నిర్ణీత సమయంలో తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. క్రమశిక్షణతో వ్యవహరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిత్యావసర సరుకులకు ఎలాంటి కొరత లేదన్న ఆయన.. వదంతులు నమ్మొద్దని కోరారు.
కిలో గోధుములు...
రూ.2కే కిలో గోధుమలు అందిస్తామని తెలిపారు జావడేకర్. ఒప్పంద ఉద్యోగులకూ వేతనాలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. కాంట్రాక్టు కార్మికులు, సిబ్బందికి లాక్‌డౌన్ సమయంలో వేతనాలు ఇవ్వాలని.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు విజ్ఞప్తి చేశారు కేంద్రమంత్రి. పాత్రికేయులు, వైద్యులు, వైద్యసిబ్బంది ప్రజా సేవ చేస్తున్నారని గుర్తుచేశారు. వారికి సంఘీభావం తెలపాలని కోరారు.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా అధికార యంత్రాంగమంతా సకారాత్మక ధోరణితో ఐక్యంగా పనిచేసి.. ఈ కష్టకాలాన్ని అధిగమిస్తాం. వైరస్ కారణంగా యావత్ ప్రపంచంలో నెలకొన్న పరిస్థితి భారత్‌లో తలెత్తదని విశ్వసిస్తున్నాను.అందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రధాని మోదీ ప్రకటించిన లాక్‌డౌన్ మంచి ప్రభావం చూపుతుందని విశ్వాసం ఉంది. సంయుక్త కార్యాచరణతోనే కరోనా లాంటి వైరస్‌పై పోరాటం చేయగలం. ఇంటికే పరిమితం కావాలి, సామాజిక దూరం పాటించాలి. చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలి. వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే.. వైద్యులను సంప్రదించాలి. ఈ నాలుగు సూత్రాలను పాటిస్తే.. కరోనాపై తప్పకుండా విజయం సాధిస్తాం.
---ప్రకాశ్ జావడేకర్, కేంద్ర సమాచార శాఖ మంత్రి
సమావేశంలో సామాజిక దూరం..
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో.. మంత్రులంతా సామాజిక దూరాన్ని పాటించారు. కేబినెట్ సమావేశంలో మంత్రుల ముందు ఉండే.. భారీ బల్లను తీసివేయగా, ప్రధాని సహా మంత్రులంతా దూరం దూరంగా కూర్చుని సామాజిక దూరం ఆవశ్యకతను.. ప్రజలకు చాటిచెప్పారు.