దృఢ సంకల్పం ఉంటే.. సాధ్యం కానిదంటూ ఏదీ లేదని మరో సారి నిరూపించింది ఓ గిరిజన మహిళ. తనను కన్నవారి కడుపు నింపేందుకు, తాను కన్న.. బిడ్డల కలలు నెరవేర్చేందుకు ఒంటరిగానే ముందడుగేసింది. బీడుగా మారిన తన బతుకు మడిలో కష్టాలను దున్ని పారేసేందుకు 'ట్రాక్టర్ డ్రైవర్'గా మారింది.
పట్టుదలతో సాధించి..
ఒడిశా సుందర్గఢ్కు చెందిన అనీమా ఓరం చదువుకోలేదు. పెళ్లైనప్పటి నుంచి భర్త ట్రాక్టర్ నడిపి తెచ్చిన డబ్బుతో ఇల్లు గడిచేది. ఉన్న కాస్త పొలం పనులు కూడా భర్తే చూసుకునేవాడు. కానీ, మూడేళ్ల కింద అనీమా భర్త మరణించాడు. దీంతో అనీమా జీవితంలో ఒక్కసారిగా పిడుగు పడ్డట్టైంది. ఇద్దరు పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులను ఎలా పోషించాలో తోచక బోరున విలపించింది. కానీ, ఇక తనకు ఏడుపే గతి అనుకుని కూర్చోలేదు. కష్టాలను ఎదురీదేందుకు తన ముందున్న మార్గాలను వెతికింది. భర్త బాధ్యత తన భుజాలపై వేసుకుని.. ట్రాక్టర్ను తానే నడపాలని నిర్ణయించుకుంది.
కొద్ది రోజుల్లోనే ట్రాక్టర్ నేర్చుకుని తన పొలం దున్ని పండించడం మొదలుపెట్టింది. మహిళ ట్రాక్టర్ నడపడమేంటని వెక్కిరించిన ఊరి జనం ఇప్పుడు తమ పొలమూ దున్నమని అనీమాను కోరుతున్నారు. వచ్చిన డబ్బుతో కుటుంబం కడుపునింపుతోంది. అంతే కాదు, చదువు లేక తన బిడ్డల భవిష్యత్తు తనలా మారకూడదని.. ఇద్దరినీ ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్చింది.
"నా భర్త చనిపోయాక ఏం చేయాలో, ఎలా బతకాలో తెలియలేదు. అప్పుడు నేను ట్రాక్టర్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నా. 20 ఏళ్లుగా తెలిసిన ఓ డ్రైవర్ను పిలిచి ట్రాక్టర్ నేర్పించమని కోరాను. కానీ, ముందు ఆయన ఒప్పుకోలేదు. బతిమలాడి. బలవంతంగా ట్రాక్టర్ నేర్చుకున్నాను. ఇదే నా వృత్తిగా మారింది. ఇతరులు.. పొలం దున్నేందుకు నా ట్రాక్టర్ అద్దెకు తీసుకుంటారు. ఆ డబ్బుతో నా పిల్లలకు కడుపునిండా అన్నం పెడుతున్నాను.'
- అనీమా ఓరం, ట్రాక్టర్ డ్రైవర్