నాణ్యమైన జీవనానికి భరోసా ప్రాతిపదికన నిరుడు ప్రపంచవ్యాప్తంగా 140 నగరాలతో జాబితా రూపొందిస్తే, దేశ రాజధాని దిల్లీ 118వ స్థానంలో, వాణిజ్య రాజధాని ముంబయి దాని వెన్నంటి నిలిచాయి. ఏ దేశ ప్రగతి రథానికైనా నగరాలే ఇరుసుగా మారనున్నాయని అంతర్జాతీయ అధ్యయనాలు ఘోషిస్తున్న వేళ- ఇక్కడ అవి నరకానికి నకళ్లుగా నేటికీ పరువుమాస్తున్నాయి. ఈ దుస్థితిని దునుమాడాలన్న సత్సంకల్పంతోనే మోదీ ప్రభుత్వం 2015లో అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్), ఆకర్షణీయ నగరాలు (స్మార్ట్ సిటీస్), పట్టణాల్లో పేదలందరికీ గృహవసతి పథకాల్ని ఘనంగా పట్టాలకెక్కించింది. ప్రజల ఆకాంక్షలకు మించి వారికి సకల సౌకర్యాలు అందించేవిగా స్మార్ట్ సిటీలను అభివర్ణించిన ప్రధాని మాటల సాక్షిగా- నూరు ఆకర్షణీయ నగరాల ఎంపిక కసరత్తులోనూ కేంద్రం కొత్త పుంతలు తొక్కింది. వచ్చే జూన్‌లో ఆకర్షణీయ నగరాలపై మధ్యంతర నివేదిక ఇస్తామని కేంద్రం చెబుతున్నా- మొత్తం రెండు లక్షల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 5,151 ప్రాజెక్టులు వంద నగరాల్లో వివిధ దశల్లో ఉన్నట్లు తాజా ఆర్థిక సర్వే ప్రకటించింది. నూరు నగరాల్లోనూ ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వ్యవస్థలు, నగరస్థాయి సలహా బృందాలు, ప్రాజెక్టు నిర్వహణ సలహాదారుల నియామకాలు పూర్తి అయ్యాయంటున్నా- పథకాల నత్తనడకే నిరాశాజనకంగా ఉంది. మొన్న నవంబరు 14నాటికి రూ.22,569 కోట్ల వ్యయంతో 1290 ప్రాజెక్టులు (11శాతం) పూర్తి కాగా తక్కినవన్నీ టెండర్లు, వర్క్ ఆర్డర్ల దశలోనే ఉన్నాయి. అహ్మదాబాద్ నుంచి అమరావతి దాకా 20 నగరాలు అత్యుత్తమ పనితీరు కనబరచాయంటూ- చివరి 20 స్థానాల్లో ఉన్న సిమ్లా, చండీగఢ్ లాంటివాటిని పైవాటితో జతకట్టించి మెరుగైన ఫలితాలు రాబట్టాలని కేంద్రం తలపోస్తోంది. దిల్లీ మహా నగరమే విషవాయు కాలుష్యం కాటుకు కుదేలైపోతున్న నేపథ్యంలో, నగర ప్రణాళికల్లో స్థానిక ప్రాథమ్యాలకే పెద్దపీట దక్కేలా విధాన రచనలో మార్పులు రావాలి!
ఆరోగ్య ఆత్యయిక స్థితి ప్రకటించేటంతగా దేశ రాజధాని దిల్లీలో మూడు నెలల క్రితం గాలి నాణ్యత క్షీణించింది. గాలి నాణ్యతా సూచీ మేరకు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య భరిత నగరంగా దిల్లీ నిలిచిందంటూ విస్తుపోయేవారు తెలుసుకోవాల్సిన వాస్తవం- దేశ జనాభాలో దాదాపు 76శాతం వాయు నాణ్యతా ప్రమాణాలకు ఏమాత్రం సరితూగని ప్రాంతాల్లోనే నివసిస్తున్నారన్నది! వాయు కాలుష్యాన్ని ‘తీవ్రాందోళనకర అంశం’గా గుర్తించిన కేంద్రం తాజా బడ్జెట్లో ఆ ముప్పును ఎదుర్కోవడానికి రూ.4,400 కోట్లు కేటాయించింది. పరిమిత ఆర్థిక వనరులు పర్యావరణహిత అభివృద్ధి పనుల అమలుకు ప్రధాన ప్రతిబంధకం అవుతుంటే, వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు జోరెత్తి నగరాల వెన్ను విరిచేస్తున్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకంగా ఆకర్షణీయ నగరాల కోసం కేంద్రం అయిదేళ్లలో కేటాయిస్తున్న మొత్తం రూ.48,000 కోట్లు! అది ఒక్కో స్మార్ట్ సిటీకి ఏడాదికి వందకోట్ల రూపాయల వంతున అయిదేళ్లు వెచ్చిస్తే- ఆయా రాష్ట్రాలు/స్థానిక సంస్థలు అంతే మొత్తాన్ని తమ వాటాగా జమ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా అయిదేళ్లలో వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో ఒక్కో నగరం స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతుందన్న కేంద్రం- అమృత్, స్వచ్ఛభారత్, హృదయ్, స్కిల్ ఇండియా, అందరికీ ఆవాసం వంటి పథకాల్నీ స్మార్ట్ సిటీలకు అనుసంధానించి అద్భుత ఫలితాల్ని సాధించగలమని భావించింది. పరస్పర సహకారం, స్పర్ధతో కూడిన సమాఖ్య స్ఫూర్తిని కేంద్రం ప్రస్తావించినా- అయిదేళ్ల తరవాతా నగరాల్లో ఏ గుణాత్మక మార్పూ ప్రస్ఫుటం కాలేదన్న నిర్వేదమే గుండెల్ని మెలిపెడుతోంది!
గత జనాభా లెక్కల (2011) ప్రకారం 31శాతంగా ఉన్న నగర భారతం స్థూల దేశీయోత్పత్తిలో 63శాతం అందిస్తోంది. 2030నాటికి దేశ జనాభాలో 40శాతం నగరాల్లోనే ఉంటుందని, మూడొంతుల జీడీపీకి అదే దోహదపడుతుందని అధ్యయనాలు చాటుతున్నాయి. అందుకు తగ్గట్లుగా సకల మౌలిక సదుపాయాలు, సమృద్ధిగా పెట్టుబడులతో విస్తృతంగా ఉపాధి అవకాశాలు, మొబైల్ ఫోన్ల ద్వారా అందుబాటులోకి వచ్చే సర్కారీ సేవలు, నడక దూరంలో పని ప్రదేశాలు, ఆహ్లాదకర పరిసరాలు- వీటన్నింటినీ పొదివి పుచ్చుకోవాలన్న లక్ష్యంతో చేపట్టినవే ఆకర్షణీయ నగరాలు! 2040నాటికి మౌలిక వసతుల రంగంలో ఇండియా 4.5 లక్షల కోట్ల డాలర్లు (దాదాపు 320 లక్షల కోట్ల రూపాయలు) ఖర్చు చేయాల్సి ఉందని, అందులో సింహభాగం నగరాలకే మళ్ళించాలని 2017-’18 ఆర్థిక సర్వే వెల్లడించింది. కొత్తగా నగరాల బాటపట్టే 60 కోట్ల జనావళి కోసం వచ్చే పదేళ్లపాటు ఏటా ఒక షికాగో నగరాన్నే నిర్మించాల్సి వస్తుందని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి చెబుతున్నారు. సమగ్రాభివృద్ధి పంథాలో కాకుండా, ప్రాజెక్టుల వారీగా చేపట్టే పనులతో నగరాల ముఖచిత్రం మారిపోతుందనో, మౌలిక సమస్యలన్నీ తీరిపోతాయనో అనుకొనే వీల్లేదు! అంతకుమించి ప్రాంతాలవారీ అభివృద్ధి ప్రాజెక్టులపైనే 80శాతం నిధుల వ్యయీకరణ జరుగుతోందని, వాటివల్ల ఆయా నగరాల్లో అయిదుశాతం జనాభాకే ప్రయోజనం దక్కుతుందని అంటున్నారు. అడ్డూ ఆపూ లేకుండా సాగుతున్న వలసలతో ఊపిరి సలపనంతగా నగరాలు కిక్కిరిసిపోతున్న తరుణంలో విస్తృత జన బాహుళ్యానికి సాంత్వన కలిగించే ప్రాథమిక వసతుల పరికల్పనే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యూహాలు పరివర్తన చెందాలి. మంచి గాలి, నీరు, మురుగు నీటిపారుదల వ్యవస్థలు, విద్య, వైద్యం, రవాణా వంటి సదుపాయాలతో బతుకుతెరువు గమ్యాలను పరిపుష్టం చెయ్యాలి!
ఇదీ చూడండి: సరిహద్దు వెంబడి 3వేలసార్లు పాక్ కాల్పులు..!