కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ పశ్చిమ బంగ ప్రభుత్వానికి సూచించింది. ధర్నాలో కూర్చుని అఖిల భారత సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పశ్చిమ బంగ ప్రధాన కార్యదర్శి పేరిట ఈ ఆదేశాల్ని విడుదల చేశారు.
రాజీవ్ కుమార్ సహా పలువురు పోలీసులు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ధర్నాలో కూర్చోవడం తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ.
గవర్నర్ నివేదికతోనే చర్యలు..
సీబీఐ వ్యవహారంపై కోల్‌కతాలో ఆదివారం రాత్రి నుంచి జరుగుతోన్న వరుస పరిణామాలపై గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి కేంద్ర హోంమంత్రిత్వశాఖకు (రాజ్‌నాథ్ సింగ్)కు సమగ్ర నివేదిక సమర్పించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
శారదా కుంభకోణం విషయంలో కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను ప్రశ్నించడానికి వెళ్లిన సీబీఐ అధికారులను నిర్బంధించడంతో వివాదం మొదలైంది. కోల్‌కతా పోలీసులకు అండగా నిలిచి మమత బెనర్జీ సత్యాగ్రహం చేపట్టారు. పశ్చిమ బంగను నాశనం చేయడానికి మోదీ-షా ద్వయం కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
సీబీఐ అధికారులకు ముప్పు ఉందనే సమాచారంతో వారి భద్రత కోసం కేంద్ర రిజర్వ్ దళాలను కోల్‌కతాకు పంపారు.
ఎవరీ రాజీవ్‌కుమార్..
1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌కుమార్ శారదాకేసును దర్యాప్తు చేశారు. అయితే ఆ కేసుకు సంబంధించిన నివేదికలు, దస్త్రాలు సీబీఐకి అప్పగించకుండా అతను దాస్తున్నట్లు సీబీఐ ఆరోపించింది. అదే విధంగా ఎన్నికల సన్నద్ధత ఏర్పాట్లను పరిశీలిస్తోన్న కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికీ హాజరుకాలేదని అతనిపై ఆరోపణలున్నాయి.