హోమియోపతి, భారతీయ కేంద్ర వైద్య మండళ్లకు సంబంధించిన ఆర్డినెన్స్‌ల స్థానంలో తీసుకొచ్చిన రెండు బిల్లులకు రాజ్యసభ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ రెండు బిల్లులను ఈనెల 15న మంగళవారమే లోక్‌సభ ఆమోదించింది.
హోమియోపతి కేంద్ర మండలి సవరణ బిల్లు-2020, భారతీయ కేంద్ర వైద్య మండలి సవరణ బిల్లు-2020ను రాజ్యసభలో గురువారం ప్రవేశపెట్టారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. బిల్లులపై చర్చ సందర్భంగా.. ప్రతి పౌరుడికి చౌకగా, సులభంగా వైద్య సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. ఆ దిశగానే ఏప్రిల్ 24న ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చినట్లు చెప్పారు.
హోమియోపతి కేంద్ర మండలి(సవరణ) బిల్లు-2020.. మండలి గడువు రెండేళ్ల కాలం పూర్తయిన ఏడాదిలోపు తిరిగి ఏర్పాటు చేయాలని సూచిస్తోంది. భారతీయ కేంద్ర వైద్య మండలి(సవరణ) బిల్లు-2020.. కేంద్ర వైద్య మండలిని ఏడాదిలోపు పునర్నిర్మించాలని సూచిస్తోంది. అప్పటి వరకు కేంద్రం ఏర్పాటు చేసే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఆ అధికారాలు ఉంటాయి.
ఎంపీల జీతాల కోత బిల్లుకు ఆమోదం..
ఎంపీలు, మంత్రుల జీతాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించే బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు, పెన్షన్ (సవరణ) బిల్లు-2020ని గత మంగళవారమే లోక్‌సభ ఆమోదించింది.
ఇదీ చూడండి: రెండు వ్యవసాయ బిల్లులకు లోక్‌సభ ఆమోదం