కోలీవుడ్ అగ్రనటుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నటుడిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆయన దృష్టి రాజకీయాల వైపు మళ్లినట్లు కనిపిస్తోంది. ఈ విషయంపై విజయ్ హడావుడిగా లేకున్నా.. రాజకీయ కదనరంగంలోకి వచ్చేది మాత్రం ఖాయమని సమాచారం.
శనివారం విజయ్ ఫొటోలు తిరుచిరాపల్లి వీధుల్లో దర్శనమిచ్చాయి. తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి ఆయనే అంటూ రాసిన ఉన్న పోస్టర్లు వెలిశాయి. అంతేకాక విజయ్ మక్కల్ ఇయక్కమ్(వీఎంఐ-విజయ్ ప్రజా ఉద్యమం) ప్రతినిధులతో ఈ నటుడు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ పరిశీలిస్తే ఆయన రాజకీయాలవైపు అడుగులు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు అర్థమవుతోంది.
సమయం వచ్చినప్పుడు 'వీఎంఐ' రాజకీయ పార్టీగా మారుతుందని విజయ్ తండ్రి, దర్శకుడు చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు సైతం ఈ వార్తలకు ఆధారంగా నిలుస్తోంది. అయితే విజయ్ మాత్రం తన అభిమానులను సంయమనం పాటించాలని కోరుతున్నారు. ఇటువంటి ప్రచారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇప్పటికే ఎంతో మంది..
తమిళనాడులో అగ్ర నటీనటులు రాజకీయ అరంగేట్రం చేయడం ఇదే తొలిసారేం కాదు. ఎంజీఆర్ మొదలుకొని జయలలిత వరకు సినీ నేపథ్యంతో సంబంధం ఉన్న వ్యక్తులే తమిళనాడును పాలిస్తూ వచ్చారు. మరోవైపు విశ్వనటుడు కమల్‌హాసన్ ఇప్పటికే పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి 5 శాతం ఓట్లను సాధించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన పార్టీని ఇంకా ప్రారంభించకపోయినప్పటికీ.. రాజకీయంవైపు అడుగేసేందుకు చురుకుగా పనిచేస్తున్నారు.
కోలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న విజయ్‌కు తమిళనాడుతో పాటు కేరళలో భారీగా అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ అరంగేట్రంపై ప్రస్తుత పార్టీలు నిశితంగా గమనిస్తూ ఉన్నాయి. విజయ్ నటించిన పలు సినిమాలు సైతం రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. 'మెర్సెల్' చిత్రంలో జీఎస్టీ, నోట్ల రద్దుపై విమర్శలు చేయడం భాజపాకు ఆగ్రహం కలిగించింది. మరోవైపు సర్కార్ చిత్రంలో శశికళ గురించి ప్రస్తావించడంపై అన్నాడీఎంకే మండిపడింది.
భాజపాలోకి విజయ్ తండ్రి!
ఇదే సమయంలో విజయ్ తండ్రి చంద్రశేఖర్ భాజపాలో చేరుతారంటూ విస్తృత ప్రచారం జరిగింది. ఖుష్బూ భాజపా తీర్థం పుచ్చుకున్న తర్వాత ఈ వదంతులు తారస్థాయికి చేరాయి. అయితే ఇవన్నీ అవాస్తవాలేనని చంద్రశేఖర్ 'ఈటీవీ భారత్'తో స్పష్టం చేశారు.
"నేనెందుకు భాజపాలో చేరుతాను? అలాంటి అవసరమేమీ లేదు. విజయ్ తండ్రిని కాబట్టి నాపై ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారు. వీఎంఐ భాజపాతో కలవదు. సమయం వచ్చినప్పుడు రాజకీయ పార్టీగా మారుతుంది."
-చంద్రశేఖర్, విజయ్ తండ్రి
వచ్చే సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో విజయ్ అభిమానులు చురుకుగా పనిచేస్తున్నారు. విజయ్ సైతం వీఎంఐ జిల్లా స్థాయి కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే కొంతమందితో సమావేశమయ్యారని పేర్కొన్నారు.
ఆచితూచి..!
రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు పరిస్థితులను విజయ్ పరిశీలిస్తున్నారని పరిశీలకులు, మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్(ఎంఐడీఎస్) అధ్యాపకులు డా. సీ లక్ష్మణన్ చెబుతున్నారు. వచ్చే ఎన్నికల ముందు కాకపోయినా.. తర్వాతైనా బరిలోకి దిగే అవకాశం ఉందని అంటున్నారు.
"విజయ్ పరిస్థితులను అన్వేషిస్తున్నారు. అతను యువకుడు. ఆయన అభిమానుల సంఘం-వీఎంఐ.. స్వచ్ఛంద సేవ చేస్తూ ప్రజలకు దగ్గరవుతోంది. అతని తండ్రి చంద్రశేఖరన్ వివేకంతో వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు రజనీకాంత్, కమల్హాసన్ల అవకాశాలు, భవిష్యత్తు గురించి విజయ్ ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజకీయ ప్రయాణం ప్రారంభించే అవకాశాలు లేవు. కానీ తర్వాత ఈ రంగంలోకి దిగొచ్చు."
-సీ లక్ష్మణన్, ఎంఐడీఎస్ అధ్యాపకులు
మరి.. రజనీకాంత్‌లా విజయ్ కూడా రాజకీయ అరంగేట్రం విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తారా లేదా కమల్‌హాసన్‌లా పార్టీని ప్రకటించి ఎన్నికల బరిలోకి నేరుగా దిగుతారా అనే ప్రశ్నలకు సమాధానం కోసం ఇంకొంత కాలం వేచిచూడాల్సిందే.