మూఢనమ్మకానికి ఆశ తోడైంది. దీంతో చనిపోయిన తమ కుమారుడు బతికొస్తాడని మృత దేహాన్ని గంటల పాటు ఉప్పులో ఉంచారీ దంపతులు. ఎంతసేపటికీ బాలుడిలో చలనం రాలేదు. దీంతో చేసేదేమీ లేక అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో జరిగింది.
వివరాల్లోకెళ్లే.. సిర్వారా అనే గ్రామంలో ఓ బాలుడు తన స్నేహితులతో కలిసి నీటి గుంటలో ఈతకు వెళ్లాడు. ఈత రాకపోవడం వల్ల నీటిలో మునిగి చనిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. ఐదు బస్తాల ఉప్పు తెచ్చి మృత దేహంపై పోశారు. గంటలు గడిచినా బాలుడిలో చలనం లేదు, ప్రాణాలతో తిరిగి రాలేదు. దీంతో తమ కుమారుడు తిరిగి రాడని అంత్యక్రియలు పూర్తి చేశారు.
అయితే ఎవరైనా నీళ్లలో పడి చనిపోతే.. ఇలా వారిని ఉప్పులో ఉంచితే ప్రాణాలతో వస్తారని వారికి ఎవరో చెప్పారు. తమ కుమారుడికి ఇలా జరగడం వల్ల ఆ విషయం గుర్తుకు వచ్చి ఇలా చేశారు. గతంలోనూ ఇలాంటి పలు ఘటనలు జరిగాయి. ఇలాంటి విషయాల్లో ప్రజలను చైతన్య పరిచి.. మూఢ నమ్మకాలతో జరిగే అనర్థాలను అరికట్టేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: హోటల్లో అగ్నిప్రమాదం.. నలుగురు దుర్మరణం.. రోడ్డుప్రమాదాల్లో ఏడుగురు మృతి
గణేశ్ నిమజ్జనంలో మత సామరస్యం.. ముస్లిం అంత్యక్రియల కోసం ఏం చేశారంటే?