మంచు కురిసే వేళల్లో అందాల కశ్మీరం ముగ్ధమనోహరంగా మారుతుంది. హిమసోయగాలు.. భూతల స్వర్గాన్ని తలపిస్తాయి. విపరీతమైన మంచు వల్ల పర్వత ప్రాంతాలు సరికొత్త అందాలను సంతరించుకుంటాయి. ఈ అనుభూతిని ఆస్వాదించేందుకు వేలాది పర్యటకులు.. కశ్మీర్ లోయకు పయనమవుతూ ఉంటారు. ఇటీవల భద్రతపరంగా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టడం, ఉగ్రవాద కార్యకలాపాలు మరింత తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది పర్యాటకులు కశ్మీర్ లోయకు పోటెత్తారు.
హిమపాతం ఎక్కువగా ఉండే గుల్మార్గ్, పహల్గామ్, సోన్‌మార్గ్ ప్రాంతాలకు పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలి వెళుతున్నారు. గుర్రాలపై ప్రయాణిస్తూ.. మంచులో ఆడిపాడుతూ సందడి చేస్తున్నారు. గతంలో కశ్మీర్‌కు రావాలంటే కొంత భయంగా ఉండేదని, నేడు ఇక్కడ పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని పర్యటకులు చెబుతున్నారు. ఇక్కడి ప్రజలు, వారి అతిథ్యం చాలా బాగుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభం నుంచే కశ్మీర్ లోయలో.. పర్యటకుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఇక్కడి హోటళ్లు, అతిథి గృహాలు పర్యటకులతో నిండిపోయాయి. గత రెండేళ్లుగా పర్యటక రంగం ఇక్కడ బాగా అభివృద్ధి చెందిందని అధికారులు చెబుతున్నారు.