Manipur All Party Meeting : ప్రధాని ఆదేశాల మేరకు మణిపుర్‌లో శాంతి పునురుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని అఖిలపక్ష నాయకులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలియజేశారు. హింస మెుదలైనపట్నుంచి నుంచి ప్రధానితో మాట్లాడని రోజు లేదని అమిత్ షా.. సమావేశంలో చెప్పినట్లు మణిపుర్ భాజపా ఇన్‌ఛార్జి సంబిత్ పాత్రా తెలిపారు. మణిపుర్‌లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన పార్లమెంటు భవనంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంఎకే, ఏఐడీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షపార్టీలు హాజరయ్యాయి.
మణిపుర్ శాంతి భద్రతలు కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. సమావేశంలో కొన్ని పార్టీలు ఆరోపించాయి. ఆ రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని మండిపడ్డాయి. వీలైనంత ఎక్కువ భద్రత బలగాలను మణిపుర్‌కు పంపించాలని మరికొన్ని పార్టీలు సూచించాయి. చాలా కాలంగా ప్రధాని మణిపుర్ అల్లర్ల మాట్లాడకపోవడంపై.. ప్రతిపక్షపార్టీలన్నీ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సమావేశానికి పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు.
అయితే, ఈశాన్య రాష్ట్రానికి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లాలని ప్రతిపక్షాలు ఈ సమావేశంలో డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మణిపుర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌ను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాష్ట్రపతి పాలన విధించాలని సమాజ్‌వాదీతో పలు పార్టీలు డిమాండ్ చేశాయి. ఎస్టీ హోదా కోసం మెయితీ వర్గం డిమాండ్ చేయడం వల్ల కుకీ, మెయితీ వర్గాల మధ్య ఘర్షణలు మెుదలయ్యాయి.
సమావేశం అనంతరం.. మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీ సింగ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 8 డిమాండ్లను అమిత్ షా ముందు ఉంచామని.. ఆయన తెలిపారు. ప్రధాని అధ్వర్యంలో ఈ సమావేశం జరిగి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. మణిపూర్‌లో శాంతి కోసం రోడ్‌మ్యాప్‌ను సమర్పించారా? అన్న ప్రశ్నకు హోంమంత్రి ప్రతికూలంగా సమాధానం ఇచ్చారని ఇబోబీ వెల్లడించారు. ప్రస్తుత మణిపుర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ సారథ్యంలో శాంతిభద్రతలు నెలకొల్పడం సాధ్యం కాదని.. ఆయన్ను వెంటనే తప్పించాలని ఇబోబీ సింగ్ డిమాండ్ చేశారు.
మణిపుర్‌లో ప్రస్తుతం 36000 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పర్యవేక్షణకు 40 మంది ఐపీఎస్ అధికారులను కూడా అక్కడికి పంపినట్లు వెల్లడించాయి. నిత్యవసరాలతో పాటు ఔషధాలు కూడా అందుబాటులో ఉంచినట్లు వర్గాలు పేర్కొన్నాయి. మొదటి రోజు నుంచే మణిపుర్ అల్లర్లను అమిత్ షా పర్యవేక్షిస్తున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం మణిపుర్‌లో పరిస్థితులు నిధానంగా మెరుగుపడున్నాయని.. సమావేశంలో అమిత్ షా తెలిపినట్లు వివరించాయి. జూన్ 13 నుంచి అల్లర్లలో ఒక్కరు కూడా చనిపోలేదని ఆయన వెల్లడించినట్లు పేర్కొన్నాయి. అఖిలపక్ష సమవేశంలో శాంతి పునరుద్ధరణ కోసం అన్నీ పార్టీలు.. రాజకీయాలను పక్కన పెట్టి తగిన సూచనలు చేశాయని తెలిపాయి.