హరియాణాలో చనిపోయిన 18 నెలల మహిరా అనే ఓ చిన్నారి అవయవదానం చేసింది. తాను చనిపోతూ కూడా రెండు నిండు ప్రాణాలను కాపాడింది 18 నెలల చిన్నారి. మేవాత్‌కు చెందిన 18 నెలల చిన్నారి మహిరా నవంబరు 6న ఆడుకుంటూ ఇంటి బాల్కనీ నుంచి జారి కిందపడిపోయింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవంబర్ 11న బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులను ఒప్పించిన వైద్యులు.. చిన్నారి కాలేయాన్ని ఐఎల్‌బీఎస్‌లో మరో ఆరేళ్ల చిన్నారికి అమర్చారు. రెండు కిడ్నీలను ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న 16 ఏళ్ల ఓ పేషెంట్‌కు ట్రాన్స్‌ప్లెంట్ చేశారు. కార్నియా, గుండె సంబంధిత అవయవాలను తర్వాత వినియోగించడానికి భద్రపరిచారు.
"దిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గత ఆరు నెలల్లో అవయవ దానం చేసిన వారిలో రెండో చిన్నారి మహిరానే. ఎయిమ్స్ ట్రామా సెంటర్లో ఆర్గాన్స్ డొనేట్ చేసిన మూడవ చిన్నారి ఈమే. రోలీ అనే చిన్నారి మొదట అవయవదానం చేయగా, తర్వాత రిషాంత్ అనే 18 నెలల బాలుడు తన ఆర్గాన్స్ డొనేట్ చేశాడు."
దీపక్ గుప్తా, డాక్టర్
దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారి ప్రాణాలను కాపాడటానికి అవయవదానం చాలా అవసరమని డాక్టర్ తెలిపారు. చాలా మందికి అవయవాల దానంపై అవగాహన లేక ముందుకు రావట్లేదని చెప్పారు. అయితే దిల్లీ ఎయిమ్స్ సిబ్బంది ప్రజలకు అవయవదానంపై అవగాహన కల్పించామని.. దీంతో ఆరునెలలోనే అవయవదానాల సంఖ్య చాలా పెరిగిందని పేర్కొన్నారు. "చాలామంది చిన్నపిల్లలు ఎత్తు నుంచి కిందకి పడిపోవటం కారణంగానే మరణిస్తున్నారు. పిల్లలు బాల్కనీ ఎక్కాలని ప్రయత్నిస్తారు. అలాంటి సందర్భాలలో కిందికి పడిపోవడం వల్ల తలకు గాయాలవుతున్నాయి. పిల్లలు ఎత్తుకు రెండింతల ఎత్తులో బాల్కనీ ఉంటే మంచిది. ఇలాంటి మరణాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి." ప్రొఫెసర్ గుప్తా అన్నారు.
ఇవీ చదవండి:కూరగాయలతో పేపర్ తయారీ.. విద్యార్థి వినూత్న ప్రయత్నం.. త్వరలో నాచుతోనూ..
మదర్సాలో దారుణం.. బాలికలపై ప్రిన్సిపల్ అత్యాచారం.. రెండు నెలలుగా..