KTR Comments On Loan Waiver : 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదన్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటనతో సీఎం బండారం మరోసారి బయటపడిందని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. 100శాతం రుణమాఫీ పూర్తిచేశామన్న ముఖ్యమంత్రి మాటలన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయిందన్నారు. ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని దగాచేసి మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మాఫీ చేయకుండా మోసం చేస్తున్నారని 'ఎక్స్' వేదికగా కేటీఆర్ ఆరోపించారు.
2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న మాటలు నయవంచన కాక మరేంటని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారిక లెక్కల ప్రకారమే 20 లక్షల మంది అన్నదాతలకు అన్యాయం జరిగితే అనధికారికంగా రుణమాఫీ కాని రైతులందరో అని ఆందోళన వ్యక్తం చేశారు. చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి చేయలేదని, ఇవ్వాల్సిన రైతుబంధు సీజన్ ముగిసినా ఇవ్వలేదంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.