ఆగని వైఎస్సార్సీపీ నేతల అరాచకాలు - ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు తొలగింపు
🎬 Watch Now: Feature Video
Govt Land Kabza in Nandalur : అన్నమయ్య జిల్లాలో రోజుకో భూ దందా వెలుగు చూస్తోంది. వైఎస్సార్సీపీ నాయకులు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్న ఘటనలు బయటకి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో వీరికి కొందరు రెవెన్యూ అధికారులు సహకరించడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. తాజాగా నందలూరులో ప్రభుత్వ భూమిలో పెట్టిన హెచ్చరిక బోర్డును ఓ వైఎస్సార్సీపీ నేత తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేత మాడపూరి కృష్ణయ్య నకిలీ పత్రాలు సృష్టించి 50 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. దానిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. గ్రామస్థుల ఫిర్యాదుతో ఆక్రమణకు గురైన భూమిలో ప్రభుత్వ అధికారులు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేేశారు. ఇది నచ్చని మాడపూరి కృష్ణయ్య హెచ్చరిక బోర్డును తొలగించి దానిని తన వెంట తీసుకెళ్లాడు. ఇది చూసిన స్థానికులు ఆయణ్ని ప్రశ్నించగా సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరోవైపు రాజంపేట రహదారి పక్కన 11 సెంట్ల ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమ కట్టడాలు చేపట్టారు. వీటిపై కూడా అధికారులు చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు మండిపడుతున్నారు.