టీడీపీలో చేరుతున్నందుకు పోలీసులు బెదిరిస్తున్నారు : కౌన్సిలర్ పరశురాం
🎬 Watch Now: Feature Video
YSRCP Counselor Parasuram Will Join TDP : సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి, అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలోకి రావడాన్ని సీఎం జగన్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ మారుతున్న వారిపై దాడులకు తెగబడుతూ అక్రమ కేసులు బనాయించి మానసికంగా వేదిస్తున్నారు వైఎస్సార్సీపీ నేతలు.
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పురపాలక సంఘం 20వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ పరశురాం అభివృద్ధి పనులు జరగడం లేదంటూ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తనను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ వారికి అభివృద్ధి చేయడం చేతకాక పార్టీ వీడుతున్న తనను పోలీసుల చేత మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని అన్నారు. కర్ణాటకలో రెండు సంవత్సరాల క్రితం జరిగిన కేసుకు హిందూపురం టూ టౌన్ స్టేషన్కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. సీఐ పిలిచాడు రావాల్సిందే అంటూ ఉదయాన్నే ఇంటి వద్దకు పోలీసులు వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదీ ఏమైనా అధికార పార్టీని వీడి తెలుగుదేశంలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
టీడీపీలో చేరుతున్న నేతలపై దాడి : వైఎస్సార్సీపీ నాయకుడు శశిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి గత నెల 19న వైఎస్సార్ జిల్లా కమలాపురంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరారు. అదెే నెల 31న తన అనుచరులతో చేరేందుకు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది జీర్ణించుకోలేని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన అనుచరులతో వెళ్లి శశిధర్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్న వారిని అడ్డుకోవడంతో రెండు పార్టీల నాయకులు కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఎమ్మెల్యే సమక్షంలోనే ఈ దాడి జరగడం గమనార్హం.