వైఎస్సార్సీపీ అసమ్మతి నేతల రహస్య సమావేశం - పార్టీలో కలకలం - Dissident leaders of Gajuwaka
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 24, 2024, 7:31 AM IST
YCP Incharge Issue in Gajuwaka : విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి మార్పు వ్యవహారం ఆ పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికే మళ్లీ టిక్కెట్ ఇవ్వాలని సోమవారం రాత్రి గాజువాకలో ఓ హోటల్లో అసమ్మతి నేతలు రహస్య సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఇమ్రాన్, రామారావు, వంశీరెడ్డి, మరో ఇద్దరు మహిళా కార్పొరేటర్ల భర్తలు, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ చినతల్లి, వార్డు కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, వివిధ విభాగాల ఇన్ఛార్జ్లు పాల్గొన్నారు. 64వ వార్డు వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి డి.శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కాదని కొత్త ఇన్ఛార్జి ఉరుకూటి రామచంద్రకు టికెట్ ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎమ్మెల్యే వర్గం తేల్చిచెప్పింది. విశాఖలో వైసీపీ తరపున ఎంపీగా బరిలో నిలవబోతున్న బొత్స ఝాన్సీ గెలవాలంటే గాజువాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే సహకారం ఉండాలని ఈ అంశంపై అధిష్టానం పునరాలోచించుకోవాలన్నారు. లేకపోతే తామంతా ప్రత్యామ్నాయం చూసుకుంటామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే టికెట్ విషయంపై ఒకటి, రెండు రోజుల్లో బొత్స ఝాన్సీతోపాటు, ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి సుబ్బారెడ్డిని కలవాలని నిర్ణయించారు. ఈ నెలాఖరున భీమిలిలో సభ ఏర్పాట్లు జరుగుతున్న వేళ గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి అనుచరుల రహస్య సమావేశం జరగటం వైఎస్సార్సీపీ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.