లేఔట్‌లో ఉన్న స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ కార్యకర్త- అడ్డుకున్న నగరపాలక అధికారులపై దాడి - YCP Activist Attack Municipal staff
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 19, 2024, 1:23 PM IST
YCP Activist Attack With Municipal Authorities and Staff: రాష్ట్రంలో వైసీపీ నేతల ఆగడాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. మితిమీరిన ప్రవర్తనతో ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అక్రమంగా భూముల కబ్జాలు, ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు చాలా చూస్తున్నాం. తాజాగా అలాంటి సంఘటనే గుంటూరులో చోటు చేసుకుంది. ఆక్రమణలు తొలగిస్తున్న నగరపాలక అధికారులు, సిబ్బందిపై వైసీపీ కార్యకర్త దాడికి తెగబడ్డాడు. ఇన్నర్ రింగురోడ్డులోని ఓ లేఔట్‌లో ఉన్న ఖాళీ స్థలాన్ని వైసీపీ కార్యకర్త తాళ్ల కిషోర్ కుమార్ మరికొందరితో కలిసి ఆక్రమించాడు. భూమిని పూర్తిగా ఆధీనంలోకి తీసుకునేందుకు వీలుగా ప్రహరీ నిర్మిస్తున్నాడు.
విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అక్కడికి వెళ్లారు. తక్షణమే నిర్మాణ పనులు ఆపేయాలని సూచించారు. సిబ్బంది గోడను తొలగించేందుకు యత్నించగా కిషోర్ కుమార్ వారిపై రెచ్చిపోయాడు. దుర్భాషలాడుతూ అధికారులు, సిబ్బందిపై దాడి చేశాడు. వైసీపీ కార్యకర్త దౌర్జన్యాన్ని కమిషనర్ చేకూరి కీర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కమిషనర్ స్పందించి వెంటనే దాడికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై నగరపాలక అధికారులు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరపాలక సంస్థ స్థలం ఆక్రమణను అడ్డుకున్న అధికారులపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.