ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు- వైసీపీ నేతలకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 13, 2024, 12:38 PM IST
Volunteers Participating in Election Campaign With YCP Leaders: ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలన్న నిబంధనలు ఉన్నా కొందరు వాలంటీర్లు వాటిని గాలికి వదిలేస్తున్నారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం పి.నాగిరెడ్డి పల్లిలో సోమవారం మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, మాజీ మంత్రి శంకరనారాయణ, నాయకులు ఇంటింటా వైసీపీ పేరుతో ఎన్నికల ప్రచారం చేశారు. ఆ సమయంలో వాలంటీర్లు ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ నాయకులకు స్వాగతం పలుకుతూ వాలంటీరు ఫోటోలతో ఫ్లెక్సీలు వేయించారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని పలు సభలు, యాత్రల పేరుతో మారుమోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించిన వాలంటీర్లు ఎన్నికల నిబంధనలను అతిక్రమించి ప్రచారంలో పాల్గొనడమనేది గమనార్హం. సర్కారీ సేవలను గడప గడపకూ చేర్చే స్వచ్ఛంద సేవకులంటూ వాలంటీర్ల వ్యవస్థను జగన్ మోహన్ రెడ్డి సృష్టించారు. పూర్తిగా ప్రజాధనంతోనే వాలంటీర్లను పెంచి పోషించిన జగన్ వారితో సొంత పార్టీ పనులు చేయించుకుంటున్నారనడానికి ఇదే నిదర్శనంగా తెలుస్తోంది. సేవాదృక్పథం కలిగిన యువతీ, యువకులను వాలంటీర్లుగా నియమించామని వారు పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారని అనాడు సీఎం జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు వైసీపీ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొనటం చూస్తుంటే వాలంటీర్లను ఎన్నికల్లో వినియోగించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.