ప్రభుత్వ భవనాలే వైఎస్సార్సీపీ ప్రచార కార్యాలయాలు - విశాఖ అధికారుల తీరు వింతే ! - election code violation - ELECTION CODE VIOLATION

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 12:38 PM IST

Updated : Apr 8, 2024, 5:02 PM IST

Violation of Election Code in Visakha  : నాయకులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుంటే విశాఖ జిల్లా అధికారులు స్పందిస్తున్న తీరు వింతగా ఉంది. 'విశాఖ స్మార్ట్ సిటీ భవనంలో వైఎస్సార్సీపీ లోక్ సభ అభ్యర్థి బొత్స ఝాన్సీ అనుచరగణం కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కడప నుంచి వచ్చిన రత్నాకర్ అనే వ్యక్తి అందులోనే మకాం వేసి నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులను కలుస్తున్నారు. అక్కడే వైఎస్సార్సీపీ ప్రచార రథాలు, నాయకుల బెంజి కార్లు ఉంటున్నాయి. 

కోడ్​ ఉల్లంఘనపై పత్రికలో కథనాలు వస్తున్నా అధికారులు పట్టనట్టు ఉంటున్నారు. నియమావళి ఉల్లంఘనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం వైఎస్సార్సీపీ నేతలకు సాగిలపడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ స్పందించిన తీరుపైనా తీవ్ర విమర్శలు సంధిస్తున్నాయి. ఈ నెల 6వ తేదీన 'జీవీఎంసీ భవనంలో బొత్స మకాం' శీర్షికన 'ఈనాడు' ప్రధాన పత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై తీరికగా స్పందించిన జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ 'బీచ్ రోడ్డులోని స్మార్ట్​ సిటీ భవనాన్ని విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంగా కేటాయిస్తూ గతేడాది అక్టోబరు 27న జీవో నెంబరు 721 ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత సదరు భవనాన్ని జీవీఎంసీ ఆధీనంలోకి తీసుకున్నాం అంటూ వివరణ ఇచ్చారు. 

మార్చి 16న ఎన్నికల కోడ్ వస్తే భవనాన్ని జీవీఎంసీ ఎప్పుడు అధీనంలోకి తీసుకుందో కమిషనర్ స్పష్టత ఇవ్వలేదు నిజంగా జీవీఎంసీ ఆధీనంలో ఉంటే వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచార రథం, కడప జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు రత్నాకర్ కు చెందిన కార్లు భవనం ప్రాంగణంలో ఉండడం, రహస్య సమావేశాలు నిర్వహించడం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.   

మంత్రి బొత్స, ఆయన సతీమణి ఏదో ఒక సమయంలో అక్కడికి వెళ్లడం ఎన్నికల కోడ్​ ఉల్లంఘనే అయినా ఎలాంటి విచారణ చేయకుండా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉన్నామని కమిషనర్ చెప్పడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అధికార వైఎస్సార్సీపీ అనుకూలంగా వ్యవహరిస్తున్న కమిషనర్​పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

Last Updated : Apr 8, 2024, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.