రోడ్డు మంజూరైనా పనులకు దిక్కులేదు - మూడు నెలలుగా ఆదివాసీల అవస్థ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 15, 2024, 6:46 PM IST
Tribals Protest to Start Road Construction Works : తమకు మంజూరు చేసిన రహదారి నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఎంకే పట్నం పంచాయతీ కొరుప్రోలు గ్రామానికి చెందిన ఆదివాసీలు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు రహదారిపై బురదలో కూర్చుని నిరసన తెలిపారు. తాము వైద్యం కోసం తరచూ ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అమరావతిలోని సీఎంఓ కార్యాలయం వారు రహదారిని మంజూరు చేశారని అయితే ఈ ప్రక్రియ జరిగి 3 నెలలు దాటుతున్నప్పటికీ నేటి వరకు ఆ పనులు ప్రారంభించలేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎదుర్కొంటున్న విద్య, వైద్యం ఇబ్బందులకు సంబంధించి ఇటీవలే డోలీ మోతలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశామని ఈ నేపథ్యంలోనే రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. అయితే ప్రభుత్వం చేపట్టిన పల్లె పండగ కార్యక్రమంలో ఈ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయకపోవడం అన్యాయమని ఆదివాసీలు ఆందోళన చేపట్టారు.