వైసీపీ నేతల ర్యాలీ - ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలకు చుక్కలు - వైసీపీ నేతల ర్యాలీతో ట్రాఫిక్ జామ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 21, 2024, 9:25 AM IST
Traffic Jam with YCP Rally : వైసీపీ నేతలు ఆర్భాటపు ప్రదర్శనతో నిర్వహిస్తున్న సభలు, ర్యాలీలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి నిర్వహించిన ర్యాలీతో వినుకొండ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైసీపీ నేతల ర్యాలీ కోసం పోలీసులు అత్యుత్సాహంతో నగరంలో ట్రాఫిక్‌ను నిలిపేశారు. అనంతపురం - గుంటూరు జాతీయ రహదారిపై ఆంక్షలు విధించటంతో సుమారు రెండు గంటల పాటు భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
కర్నూలు రహదారిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసి ట్రాఫిక్‌ను నిలిపేయడం విమర్శలకు గురి చేస్తోంది. పాఠశాల బస్సులు, ఆర్టీసీ బస్సులు, లారీలు, ఆటోలు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు నిలిచిపోవడంతో వృద్ధులు, విద్యార్థులు, తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని నరసరావుపేట దారిలో ఉన్న పెట్రోల్ పంపు దగ్గర నుంచి ఏనుగుపాలెం మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించారు. రాజకీయ నేతల అవసరాలకు ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమేంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.