తిరూవూరు వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ మార్పు - కార్యాలయ బోర్డు తొలగింపు - తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 21, 2024, 12:21 PM IST
Tiruvuru YSRCP Office Board: ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు వైఎస్సార్సీపీ కార్యాలయం బోర్డును తొలగించారు. స్థానిక ఎమ్మెల్యే రక్షణ నిధి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తాను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నా, లేకున్నా అద్దెకు భవనాన్ని తీసుకుని పార్టీ కార్యాలయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తనకు సమయం దొరికినప్పుడు నియోజకవర్గంలోని ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వచ్చేవారు. అయితే ఇటీవల తిరువూరు ఇన్ఛార్జ్గా స్వామి దాసును వైఎస్సార్సీపీ అధిష్టానం నియమించడంతో, ఎమ్మెల్యే రక్షణ నిధి నియోజకవర్గానికి అందుబాటులో లేకుండా పోయారు. ఈ క్రమంలో తిరువూరు వైఎస్సార్సీపీ కార్యాలయ బోర్డును బుధవారం తొలగించారు. ఇప్పుడు బోర్డు మాత్రమే తొలగించారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూడా తొలగించి, యజమానికి కార్యాలయ భవనాన్ని అప్పగిస్తారా అనేది స్థానికంగా చర్చ కొనసాగుతోంది. అంతేకాకుండా ఎమ్మెల్యే పదవీకాలం ఉన్నన్ని రోజులు పార్టీ తన సొంత కార్యాలయంగా దానిని వినియోగించుకుంటారా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే రెండు సార్లు తిరువూరు నుంచి పోటీ చేసి విజయం సాధించిన తనను కాదని, మరో వ్యక్తిని ఇన్ఛార్జ్గా నియమించడంతో తన మనసు గాయపడిందని ఎమ్మెల్యే రక్షణ నిధి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.