అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు - సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి దర్శనం
🎬 Watch Now: Feature Video
Tirumala Sarva Bhupala Vahanam: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి కాలియమర్ధన అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. సర్వభూపాలురు అంటే అందరూ రాజులని అర్థం. ఈ సర్వభూపాలకుల్లో దిక్పాలకులూ చేరుతారు. విష్ణు అంశ లేనివాడు రాజు కాలేడు. 'రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే..' అని వేదాలలో వర్ణించినట్లుగా శ్రీహరి రాజాధి రాజు.
సర్వభూపాలురు వాహన స్థానీయులై భగవంతుని తమ భుజస్కంధాలపై నిలిపి విహరింపజేశారు. భూపాలకులందరూ అధికార సంపన్నులే. అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్ సేవాపరులు కావాలి. ఈ దివ్యమైన సందేశాన్ని సర్వభూపాల వాహనసేవ ఇస్తోంది. సర్వభూపాల వాహనంలో స్వామివారు విహరిస్తుండగా, వాహనం ముందు గజరాజులు నడిచాయి. భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. శ్రీవారి వైభవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.