రైతుల ఆశలపై నీళ్లు చల్లిన బుడమేరు వరద - నీట మునిగిన వేలాది ఎకరాలు - Heavy crop loss due to Budameru - HEAVY CROP LOSS DUE TO BUDAMERU
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 4, 2024, 10:21 AM IST
Thousands of Acres Submerged in Water due to Budameru Disaster : బుడమేరు సృష్టించిన జల విలయంతో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు కకావికలమయమయాయి. విజయవాడ నగరాన్ని చిగురుటాకులా వణికించిన బుడమేరు, నగరాన్ని దాటిన తర్వాత పంట పొలాలను ముంచెత్తింది. వరద ఉధృతి కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. ఇప్పటికే పంటపై రూ. వేలల్లో పెట్టుబడులు పెట్టిన రైతన్నలు.. ప్రస్తుతం పంట చేతికి వచ్చే దశలో బుడమేరు పొంగి అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో వరి చెరకు, మొక్కజొన్న, కూరగాయలు సాగు చేసే రైతులకు అపార నష్టం వాటిల్లింది. గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో వచ్చిన వరద తమని నిండా ముంచేసిందని రైతులు వాపోతున్నారు.
ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరైందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పొలాల్లో ఐదడుగుల మేర వరద ప్రవాహం సాగుతోందన్నారు. ఈ వరద తగ్గి పంటలు బయటపడాలంటే దాదాపు వారం పైనే పడుతుందని రైతులు చెబుతున్నారు. అయితే వరద తగ్గిన పంటలు పనికిరావని వాపోతున్నారు. ఈ సీజన్లో పంటలు ఇక చేయిదాటి పోయినట్లేనని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బుడమేరుపై ఉన్న ఆక్రమణలు తొలగించి పూడిక తీస్తే భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవం పునరావృతంకాదని రైతులు అభిప్రాయపడుతున్నారు.