ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటు కల్పించాలి - సీఈఓకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు - tdp leaders Complaint to ceo - TDP LEADERS COMPLAINT TO CEO
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 10, 2024, 10:35 PM IST
TDP Leaders Complaint to CEO on Postal Ballot Voting : ఇప్పటికి ఎన్నికల విధుల్లోకి తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల ప్రధానాధికారికి తెలుగుదేశం నేతలు విజ్ఞప్తి చేశారు. అక్రమ మార్గాల ద్వారా లబ్ధిపొందేందుకు వైఎస్సార్సీపీ నేతలు ఆలోచనలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఎన్నికల సీఈఓకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ, పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. తమ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఉద్యోగులు పోలింగ్ కేంద్రాల చుట్టూ ఎండలో తిరగాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు. విసుగు చెందిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకోకుండానే వెనుదిరిగారని వెల్లడించారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో ఉద్యోగులు చివరి రోజూ వరకు నానా అవస్థలు పడ్డారని తెలిపారు. ఓటు ఎక్కడుందో తెలియక అయోమయంలో ఉన్న వారికి వైఎస్సార్సీపీ నేతలు ప్రలోభాలకు గురిచేశారని వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఉద్యోగులు నానా పాట్లు పడ్డారన్నారు. అదేవిధంగా జగన్ సహా కొందరు వైఎస్సార్సీపీ నేతలు సంస్కారవంతంగా మాట్లాడటం నేర్చుకోవాలని ఆక్షేపించారు. హైకోర్టును, ఎన్నికల సంఘాన్ని, సీఎస్ జవహార్ రెడ్డిని చంద్రబాబు ప్రభావితం చేస్తారా? అని టీడీపీ నేత వర్లరామయ్య ప్రశ్నించారు. ఖజానాలో నిధుల్లేక ఇప్పటి వరకూ లబ్దిదారుల ఖాతాల్లోకి పథకాల డబ్బులు వేయలేదని వర్ల రామయ్య విమర్శించారు.