'కూటమి విజయానికి చిలకలూరిపేట సభ తొలి అడుగు - రాష్ట్ర అభివృద్ధి కోసమే కలిసి పోటీ' - TDP Janasena BJP leaders
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 16, 2024, 4:31 PM IST
TDP Janasena BJP Leaders Comments: చిలకలూరిపేటలో ఆదివారం జరిగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రజాగళం బహిరంగసభను విజయవంతం చేయాలని ఆ పార్టీల ముఖ్యనేతలు పిలుపునిచ్చారు. సభ నిర్వహణ, సమన్వయం కోసం గుంటూరులో మూడు పార్టీల నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ధావడే, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు కోసం మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీచేస్తున్నాయని నేతలు తెలిపారు. కూటమి విజయానికి చిలకలూరిపేటలో జరిగే సభ తొలి అడుగన్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని దుర్మార్గపు పాలన సాగుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. సీఎం జగన్ పాలన గాలికి వదిలేసి అరాచకాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఏపీ పునర్నిర్మాణం కోసం కూటమి ఏర్పాటు చేయటాన్ని ప్రజలు కూడా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోబోతున్నారని వ్యాఖ్యానించారు. అందరూ కలిసి మోదీ సభను విజయవంతం చేయాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ప్రజాగళానికి ప్రతి గ్రామం నుంచి జనం తరలివస్తున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అనే శని గ్రహం నుంచి ఏపీ ప్రజలకు అతి త్వరలో విముక్తి కలుగబోతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ధావడే వ్యాఖ్యానించారు. మోదీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని, ఏపీ కూడా అలాగే ముందంజలో నిలవాలంటే కూటమికి మద్దతివ్వాలని కోరారు.