పలాస ఆసుపత్రిలో దారుణం- వైద్య సిబ్బంది లేకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులే చికిత్స చేశారు
🎬 Watch Now: Feature Video
Sanitation Workers Treated Injured Persons in Palasa: శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులే వైద్యులుగా మారిన ఘటన శనివారం వెలుగు చూసింది. పలాసలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులను వెంటనే చికిత్స కోసం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు గాని నర్సులు గాని అందుబాటులో లేరు. పారిశుద్థ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. బాధితులు గాయాలతో అల్లాడిపోతుంటే, పారిశుద్ధ్య సిబ్బంది చూస్తూ ఉండలేకపోయారు. గాయపడిన వారికి వారే తమకు తెలిసిన చికిత్స చేసి వైద్య సేవలు అందించారు. గాయాలను శుభ్ర పరచడం, మందు రాయడం వంటివి చేశారు. దీంతో బాధితులకు కొంతమేర ఉపశమనం పొందారు. వైద్యులు చేయాల్సిన ప్రథమ చికిత్సలు, శానిటేషన్ సిబ్బంది చేయడం ఆసుపత్రిలో చర్చనీయాంశం అయింది. వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతోనే, తాము స్పందించామని పారిశుద్ధ్య కార్మికులు చెప్పారు. బాధితులకు ఉపశమనం కలిగించడమే తమ ఉద్దేశ్యమని వారు పేర్కొన్నారు. తమకు మందులు రాసి ఉపశమనం కలిగించిన శానిటేషన్ సిబ్బందికి బాధితులు ధన్యవాదములు తెలిపారు. ఆసుపత్రిలో సిబ్బంది అందుబాటులో లేక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.