నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు - అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు - HEAVY RAINS IN NELLORE DISTRICT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 14, 2024, 4:21 PM IST
People Are Suffering Due To Heavy Rains In Nellore District : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాంధీబొమ్మ, సండే మార్కెట్, సంతపేట, కెేవీఆర్ పెట్రోల్ బంక్, కొండాయాపాళెం గేట్, పొదలకూరురోడ్డు ప్రాంతాల్లో వర్షపునీరు రహదారులపై ప్రవహించింది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే కావలి నియోజకవర్గంలో కావలి, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల్లో నిన్న రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మర్రిపాడులో మన్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని పెన్నా పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పెన్నా నదిలోకి ఎవరూ వెళ్లొద్దని సూచించారు. A.S పేటలో వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు.
మత్స్యకారులు సముద్రపు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో మరో మూడు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతోపాటు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తీర ప్రాంతం, పెన్నా తీరం, సోమశిల జలాశయం ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.