అనంత ఆకట్టుకుంటున్న జలపాతం సొగసులు - penna ahobilam waterfalls
🎬 Watch Now: Feature Video
Penna Ahobilam Waterfalls: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం ఆలయ పరిసరాల్లో ఉన్న జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తుంగభద్ర జలాలు ఉరవకొండ మండలంలోకి ప్రవేశించగా ఆ నీటిని మోపిడి లింక్ ఛానెల్ ద్వారా అటు పీఏబీఆర్ ఇటు ఎంపీఆర్లకు నీటిని విడుదల చేస్తున్నారు. పెన్నహోబిలం క్షేత్రం గుండా కాలువ మీదుగా నీరు నిండుగా ప్రవహిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.
ఆనకట్టపై నుంచి క్రిందకు దూకే నీరు చూపరులను కట్టిపడేస్తుంది. వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ఇక్కడికి వచ్చి జలపాతం వద్ద హాయిగా గడుపుతున్నారు. అదే విధంగా కొండ మీద ఉన్న శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని, కొండ కింద ఉన్న శ్రీఉద్భవలక్ష్మీ అమ్మవారి ఆలయాలను, ప్రధాన ఆలయం ముందు ఉన్న శ్రీఉగ్రనరసింహస్వామి, ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు విగ్రహాలను దర్శించుకొంటున్నారు. వీటితో పాటు పెన్నహోబిలానికి సమీపంలోని యేటి గంగమ్మ దేవాలయాన్ని సందర్శించి అక్కడ నీటి ప్రవాహంలోనూ హాయిగా గడుపుతున్నారు. ఉరవకొండ పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం నుంచి 42 కిలోమీటర్ల దూరంలో నున్న పెన్నహోబిల క్షేత్రం పర్యాటకులు, భక్తులకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచుతోంది. పెన్నహోబిలం జలపాతం చూడడానికి ప్రతి ఏడాది వస్తామని సందర్శకులు చెప్తున్నారు. ఆలయంలో స్వామి వారి దర్శనం అనంతరం జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు.