కాంగ్రెస్లో పదవులు అనుభవించిన వాళ్లే పెత్తనం చేస్తున్నారు: ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి
🎬 Watch Now: Feature Video
MLC Janga Krishnamurthy: వైఎస్సార్సీపీలో టికెట్ కేటాయింపుల గొడవలు ఇప్పట్లో తేలేలా లేవు. ఒక్కరికి టికెట్ ఇస్తే మరొకరు ఆందోళనలు, ధర్నాలు చేయడం పరిపాటిగా మారింది. ఇప్పటికే సీఎం జగన్ నాలుగు జాబితాలు విడుదల చేయగా అందులో 29 మందికి మెుండిచేయి చూపించారు. పార్టీకి విధేయులుగా ఉన్నవారు, పార్టీనే సర్వం అనుకున్న వారిని సైతం సీఎం జగన్ పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలో ఇక వైఎస్సార్సీపీలో తమకు చోటు లేదంటూ కొందరు పార్టీని వదలుతుంటే, మరి కొందరు ఇంకా పార్టీ తమకు అవకాశం ఇస్తుందంటూ ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇంకా టికెట్ వస్తుందని ఆశించే నేతల్లో వైఎస్సార్పీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ముందు వరుసలో ఉన్నారు.
పల్నాడు జిల్లా గురజాలలో టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి సీఎం జనగ్ టికెట్ నిరాకరించారు. తనకు టికెట్ రాకపోవడంపై ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. పార్టీ ఇచ్చే పదవి కోసం కాదని, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు పదవుల కోసం ఆరాటపడలేదన్నారు. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో జగన్ వెంట నడిచానని జంగా తెలిపారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండి పదవులు అనుభవించిన వారు, ఆ తరువాత వైఎస్సార్సీపీలోకి వచ్చి ఇక్కడ కూడా పదవులు పొందడం వల్లే, తనలాంటి బీసీ నేతలకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని జంగా వాపోయారు. బీసీ, యాదవ సంఘాలు తనకు మద్దతుగా ఉన్నాయని జంగా పేర్కొన్నారు. పార్టీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తన తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు.