రూ. 30 లక్షలకు ఆశ చూపి కిడ్నీ కొట్టేశారు - విజయవాడలో వెలుగు చూసిన మోసం - Kidney racket Frauds in Vijayawada - KIDNEY RACKET FRAUDS IN VIJAYAWADA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 8, 2024, 5:25 PM IST
Kidney Racket Gang Frauds in Vijayawada : విజయవాడ కేంద్రంగా మరోసారి కిడ్నీ రాకెట్ ముఠా మోసాలు వెలుగు చూశాయి. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ కోసం కిడ్నీ విక్రయానికి ఒప్పుకుంటే కిడ్నీ తీసుకుని తనను మోసం చేశారని గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు జిల్లా ఎస్పీ(SP) కి ఫిర్యాదు చేశారు. కిడ్నీ ఇస్తే డబ్బులు ఇస్తామని చెప్పి విజయవాడలోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ పూర్తయ్యాక ఖర్చులకు మాత్రమే లక్షా పదివేలు ఇచ్చారని వాపోయాడు. మిగిలిన డబ్బులు ఇవ్వాలని అడిగితే నోటికి వచ్చినట్లు తిడుతూ నీకు చేతనైనది చేసుకోమని బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనలాగే అమాయకులకు డబ్బు ఆశ చూపి నెలకు ఐదు నుంచి 10 మందికి కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నారని మధుబాబు ఆరోపించారు. ఆపరేషన్ తర్వాత తన భర్త ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని, తన కుటుంబానికి, పిల్లలకు న్యాయం చేయాలని మధుబాబు భార్య శైలజ కన్నీటి పర్యంతమయ్యారు.
కిడ్నీ దందాపై శరత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ అధినేత డాక్డర్ శరత్ బాబు స్పందించారు. తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే కిడ్నీ మార్పిడి చేశామన్నారు. ఇప్పటి వరకు గుంటూరు జిల్లా పోలీసులు తమను సంప్రదించలేదన్నారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం కంచడం గ్రామానికి చెందిన కేతినేని వెంకట స్వామికి జూన్ 15న కిడ్నీ మార్పిడి చికిత్స చేసినట్లు తెలిపారు. అవయవ దానంలో ఎటువంటి ఆర్ధిక లావాదేవీలు జరగలేదన్నారు.