బాలిక హత్యాచార ఘటన కలచివేసింది - నిందితులను వదిలే ప్రసక్తే లేదు: సీఎం చంద్రబాబు - Girl Missing Case in Kurnool
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 11, 2024, 5:08 PM IST
|Updated : Jul 12, 2024, 6:51 AM IST
Girl Missing Case in Kurnool District : నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక కోసం మూడో రోజూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు నందికొట్కూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా. బాలిక కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్యచేసి ముచ్చుమర్రి పంప్‌హౌస్‌కు కొంతదూరంలో మృతదేహాన్ని పారేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ముచ్చుమర్రి ఎత్తిపోతల అప్రోచ్ కాలువలో N.D.R.F బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానిక మత్స్యకారులు వలలతో గాలించారు. మరోవైపు గజఈతగాళ్లను రప్పించి గాలింపు చేపట్టారు. ఎంతకీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు నిందితులను గట్టిగా ప్రశ్నించడంతో పంపుహౌస్ సమీపంలోనే పడేసినట్లు చెప్పడంతో ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. నలుగురు బాలురు కలిసి బాలికను తీసుకెళ్లినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. పోలీసులు ముగ్గురిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మరో బాలుడు లైంగిక దాడికి పాల్పడలేదని మిగతా ముగ్గురు నిందితులు పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. పగిడ్యాల మండలం ముచ్చుమర్రి ఎత్తిపోతల వద్దకు చేరుకున్న ఆమె గాలింపు చర్యలను పర్యవేక్షించారు.
CM Chandrababu React on Nandyal Girl Rape Case: బాలిక హత్యాచార ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ ఘటన తనను కలచి వేసిందన్నారు. ఆడబిడ్డల తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నేరాలను రాష్ట్ర ప్రభుత్వం సహించదన్నారు. ఆడబిడ్డల రక్షణకు సంస్థాగత స్థాయి మెకానిజం కావాలని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. బాలిక హత్యాచార ఘటన నిందితులను వదిలే ప్రసక్తి లేదని సీఎం స్పష్టం చేశారు.