'ఓటర్ల జాబితా'కు వేలల్లో దరఖాస్తులు - ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారుల్లో గుబులు - bapatla voter list
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 21, 2024, 3:01 PM IST
Election Officials are Worried About Release of Voters List : బాపట్ల జిల్లా పర్చూరులో తుది ఓటర్ల జాబితా విడుదల విషయంలో ఎన్నికల అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఓటర్ల తొలగింపు, మార్పులకు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణను ఎన్నికల సంఘం ఈ నెల 12న నిలివేసింది. దీనికి ముందు రెండు రోజులు 22 వేల 381 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తరువాత వరుసగా నాలుగురోజులు సంక్రాంతి సెలవులు రావటంతో అధికారులు విచారణ చేపట్టలేదని తెలిపారు.
దరఖాస్తుల విచారణను 16వ తేదీ నుంచి ప్రారంభించినప్పటికీ వీటి విచారణ పూర్తి చేసి అర్హులైన వారి వివరాలు తుది జాబితాలో ప్రచురించడం అనుమానంగానే ఉంది. కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు తుది జాబితాలో లేకున్నా తరువాత జాబితాలో వస్తాయని అధికారులు చెబుతున్నారు. అధికార వైసీపీ నేతలు ఓట్ల తొలగింపు కోసం చివరి రోజు వెయ్యికి పైగా దరఖాస్తులు పెట్టినట్లు అధికారులు తెలిపారు. వీటి విచారణకు అధికారులు సైతం భయపడుతున్నారు. వైసీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి ఓట్లు తొలగిస్తే ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆందోళన చెందుతున్నారు.