ఆమంచి అనుచిత వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు - విచారణ జరపాలని ఆదేశం - EC inquiry on Amanchi Krishnamohan - EC INQUIRY ON AMANCHI KRISHNAMOHAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 24, 2024, 1:38 PM IST
EC Ordered Inquiry Into Amanchi Krishnamohan Inappropriate Comments: బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఈసీ చర్యలకు ఉపక్రమించింది. చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్‌ను చెట్టుకు కట్టేస్తామంటూ చీరాల కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బెదిరిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎన్నికల సంఘానికి ఈ నెల 21న వేటపాలెంకు చెందిన జర్నలిస్టు నాయుడు నాగార్జునరెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఆమంచి అనుచిత వ్యాఖ్యలపై విచారణ జరిపి అత్యవసర నివేదిక అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారిని, కలెక్టర్ పి.రంజిత్ బాషాను ఆదేశించింది.
చీరాల డీఎస్పీపై ఎన్నికల పరిశీలకులకు ఈ నెల 9న కలెక్టరేట్‌కు వచ్చి ఆమంచి ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఆమంచి మాట్లాడుతూ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తికి అనుకూలంగా డీఎస్పీ ప్రసాద్ పని చేస్తున్నారని ఆరోపించారు. డీఎస్పీ తీరు మార్చుకోకుంటే చెట్టుకు కట్టేస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న డీఎస్పీని బెదిరిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణమోహన్‌పై ఈసీ చర్యలు తీసుకోవాలని నాయుడు నాగార్జునరెడ్డి కోరారు.