భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: సీఎస్ జవహర్ రెడ్డి - విమానాశ్రయంపై సీఎస్ సమీక్ష
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 11:25 AM IST
CS Jawahar Reddy Conducted Review Bhogapuram Airport : భోగాపురం విమానాశ్రయం సహా రాష్ట్రంలో ఉన్న ఓడరేవుల నిర్మాణ పురోగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి (Chief Secretary Jawahar Reddy) విజయవాడలో సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో రెవెన్యూ శాఖతో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖలతో సంప్రదింపులు చేయాలని సూచించారు. భోగాపురం విమానాశ్రయం, రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట ఓడరేవుల నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో ఆయన గురువారం సమీక్షించారు.
భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాదిలో అక్కడి నుంచి విమానాలు రాకపోకలు సాగించేలా పనులను పూర్తి చేయాలని సూచించారు. భూ సేకరణ, ఆర్థికపరమైన అంశాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న మూడు ఓడరేవులు, చేపల రేవుల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని వెల్లడించారు. రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులు 45 శాతం పూర్తయ్యాయని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తెలిపారు.