పేదలకు ఇళ్లు ఇవ్వకుండా బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి: సీపీఎం
🎬 Watch Now: Feature Video
CPM Protest Demanding The Registration of Poor Houses: విజయవాడ వాంబే కాలనీలో పేదల ఇళ్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబురావు పాల్గొన్నారు. టిడ్కో ఇళ్లకు డబ్బులు వసూలు చేసి నేటికీ ఇల్లు కేటాయించకుండా వైసీపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం గాలి మాటలు చెప్పి పేదలను మభ్య పెట్టే విధంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ కేవలం కాగితాలు మాత్రమే చేతిలో పెట్టిందని పేర్కొన్నారు. వాంబే కాలనీలో గతంలో ఇచ్చిన ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేసి బ్యాంకు రుణాలు రద్దు చేస్తామని వైసీపీ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ వచ్చే లోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం తమకు ఏ మాత్రం కనపడటం లేదని వ్యాఖ్యానించారు. వెంటనే ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలని లేకుంటే దశల వారీగా ఉద్యమం ఉద్ధృతం చేస్తామని బాబురావు హెచ్చరించారు.
బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేశాయి. ప్రతి ఒక్క పేదవాడికి ఇళ్లు ఇస్తామన్నారు. ఈ ఐదు సంవత్సరాలలో కాగితాలు ఒక్కటే ఇచ్చారు. మరి ఇళ్లు ఎప్పుడు ఇస్తారో. టీడీపీ, జనసేన, వైసీపీ ఈ మూడు పార్టీలు బీజేపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు తెలుపుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలి. నిరసనలు చేసి ఇళ్ల పట్టాలను సాధించుకోవాల్సిందే. -బాబురావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి