అమూల్ కబంద హస్తాల నుంచి ఒంగోలు డెయిరీని విడిపించండి: రామకృష్ణ - CPI leaders visit Ongole Dairy
🎬 Watch Now: Feature Video
CPI Leaders Visit Ongole Dairy in Prakasam District : ప్రకాశం జిల్లా అంటే ఒంగోలు డెయిరీ పేరు గుర్తుకు వస్తుందని, అలాంటి ఎంతో విశిష్టత కలిగిన డెయిరీని గత వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు డెయిరీని ఈరోజు సీపీఐ నాయకులు సందర్శించారు. ఎంతో మంది పాడి రైతులకు ఉపాధిగా ఉన్న ఈ డెయిరీని గత ప్రభుత్వం అమూల్ సంస్థకు కట్టబెట్టి పాడి రైతులను, ఉద్యోగులను రోడ్డు మీద పడేసిందని రామకృష్ణ తెలిపారు. అల్లుడికి కట్నం ఇచ్చినట్లు దాదాపు రూ.300 కోట్ల విలువైన సంస్థ భూములను అమూల్ సంస్ఖకు ఇచ్చి రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు.
గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం పాపాల చిట్టాలో ఒంగోలు డెయిరీ కూడా చేరటం బాధాకరమని ఆయన అన్నారు. కోట్ల విలువ చేసే సంస్థ భూములను అమూల్ సంస్థకు కట్టబెట్టడం దారుణమన్నారు. జిల్లాలో ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని తెలిపారు. వీరిలో ఎక్కువ శాతం పాల ఉత్పత్తుల మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారని గుర్తు చేశారు. ఒంగోలు డెయిరీ సహకార సంఘాల నుంచి ప్రైవేటు వశం కావడంతో దాన్ని నమ్ముకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వమైనా ఈ డెయిరీని అమూల్ కబంద హస్తాల నుంచి విడిపించి, తిరిగి తెరిపించే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి లేఖ రాస్తానని రామకృష్ణ అన్నారు.