కరోనా కొత్త వేరియంట్ 350 కేసులు - ఆ రెండు జిల్లాల్లో అత్యధికం - కరోనా మహమ్మారి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 21, 2024, 1:01 PM IST
Corona Cases is Still Raging Increase in AP: కరోనా మహమ్మారి ఇంకా వణికిస్తూనే ఉంది. గడచిన 45 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 350 కేసులు నమోదయ్యాయి. ఇందులో 75 శాతం జేఎన్-1 వేరియంట్‌కు చెందినట్లు తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గు ముఖం పట్టినా ముప్పు మాత్రం ఇంకా పోలేదు. రాష్ట్రంలో సగటున రోజుకు 350 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. వీటిని పెంచితే మరిన్ని కేసులు వెలుగుచూసే అవకాశముంది. జేఎన్-1 కేసులు కర్ణాటకలో అత్యధికంగా 234 నమోదు కాగా ఆ తర్వాత ఏపీలోనే 189 ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. అందుకే ఈ రకం కేసుల పెరుగుదల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే సూచించింది.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొదట్లో పెట్టినంత శ్రద్ధ ఇప్పుడు చూపడం లేదు. రాష్ట్రంలో విశాఖ, ఎన్టీఆర్ జిల్లాల్లోనే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరుతున్న వారిని పరీక్షించినప్పుడే ఈ కొవిడ్ వేరియంట్ బయటపడుతోంది. మధుమేహం, అధిక రక్తపోటు, ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు కొవిడ్ ఇన్ఫెక్షన్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. జేఎన్-1 రకం తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి సోకుతోందని నిపుణులు తెలిపారు. బలహీనత, ఆకలి తగ్గిపోవడం వంటి ప్రాథమిక లక్షణాలు ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.