'ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తాం'- వెలిగొండ ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ అన్సారియా - VELIGONDA PROJECT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 3:41 PM IST
Collector Ansariya Visited Veligonda Project in Prakasam District: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపాడియా వద్ద ఉన్న ప్రాజెక్టు ఆనకట్ట, వాటర్ గ్రిడ్ పనులను ఆమె పరిశీలించారు. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసేలా చూడాలన్నారు. అందుకు సంబంధించిన బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. తక్కువ బడ్జెట్‌తో త్వరగా పూర్తయ్యే పనులను ప్రాధాన్య క్రమంలో చేపట్టాలని సూచించారు.
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు ఇక్కడి నుంచే నీటిని సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ఎన్నో సంవత్సరాలుగా ముంపు గ్రామాల్లో అభివృద్ధి లేక, ప్రభుత్వం ఇచ్చే పరిహారం అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు కలెక్టర్ ఎదుట బాధితులు వాపోయారు. ముంపు గ్రామాల బాధితుల సమస్యలు పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.