ప్రపంచ వేదికపై ఆర్టీపీసీఆర్ కిట్ 'మేకిన్ ఏపీ'ని ప్రతిబింబిస్తోంది : సీఎం చంద్రబాబు - CM Inaugurates RT PCR kit - CM INAUGURATES RT PCR KIT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 29, 2024, 5:43 PM IST
CM Chandrababu Inaugurates RT-PCR KIT : మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం పూర్తి స్వదేశీయంగా విశాఖ మెడ్ టెక్ జోన్లో ఆర్టీపీసీఆర్ కిట్ అభివృద్ధి చేయడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. విశాఖ మెడ్ టెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మ, జోన్ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీపీసీఆర్ కిట్‌ను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కిట్‌ను తక్కువ ధరతో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మెడ్ టెక్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు.
ఈ కిట్ తయారీకి ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అత్యవసర అంగీకారం లభించిందని సీఎం తెలిపారు. 'మేకిన్ ఏపీ' బ్రాండ్ రాష్ట్రానికి రావడానికి ఈ కిట్ దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం నుంచి మెడ్ టెక్ జోన్‌కు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని హామి ఇచ్చారు. వినియోగదారులకు ఆర్థిక భారం లేకుండా త్వరలో సోలార్‌తో నడిచే ఎలక్ట్రానికి వీల్ చైర్‌ను రూపొందించనున్నట్లు మెడ్ టెక్ జోన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తక్కువ ఖర్చుతో మన్నిక గల వైద్య పరికరాలను తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.