'రోడ్డు లేదు-లైట్లు వెలగవు' - గ్రామసభలో సమస్యలపై చిన్నారి ఫిర్యాదు - Child complaint in grama sabha
🎬 Watch Now: Feature Video
Child Raised Problems in Grama Sabha at Chandrasekharapuram : ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురంలో 5వ తరగతి చదువుతున్న ఓ చిన్నారి స్వయంగా తమ ప్రాంత సమస్యలను గ్రామసభలో విన్నవించుకుంది. స్వర్ణ పంచాయతీల సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తోంది. చంద్రశేఖపురంలో నిర్వహించిన గ్రామసభకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, కలెక్టర్ తమీమ్ అన్సారియా హాజరయ్యారు.
సభలో పలువురు తమ సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు అందిస్తున్న తరుణంలో చిన్నారి రమ్య ధైర్యంగా వేదికపైకి వెళ్లి తమ ఇబ్బందులను కలెక్టర్‌కు తెలిపింది. తమ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదని, ఇంటికి వెళ్లే దారిలో వీధి దీపాలు వెలగడం లేదని అర్జీ రూపంలో కలెక్టర్‌కు అందజేసింది. ఆ చిన్నారి తడబడకుండా చెప్పిన మాటలను ఆసక్తిగా తిలకించిన కలెక్టర్ ఫిర్యాదును ప్రత్యేకంగా స్వీకరించారు. వెంటనే కలెక్టర్ చిన్నారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ధైర్యంగా సమస్యలు వివరించిన ఆ చిన్నారిని మంత్రి వీరాంజనేయస్వామి, అధికారులు అభినందించారు.